సాధారణంగా పళ్ళు తోమేటప్పుడు తెలియక చేసే తప్పులేవి..?

By manavaradhi.com

Published on:

Follow Us

చాలామంది జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్లను 20, 30 ఏళ్లకే పాడు చేసుకుంటున్నారు. మరికొంతమది వీటిని చాలా తేలికగా తీసేసుకుంటారు. ఈ దంతాలను ఇష్టమొచ్చినట్లు వాడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంతాలు దెబ్బతిని పాడైపోతాయి. మరికొన్నిసార్లు కొన్ని రకాల అలవాట్లు కూడా దంతాలను దెబ్బతీస్తున్నాయి. కొందరు ఉదయాన్నే పళ్లను చాలాసేపు గట్టిగా రుద్దుతుంటారు. ఇలా గట్టిగా బ్రషింగ్‌ చేస్తేనేగానీ వాళ్లకు తృప్తీ అనిపించదు. కానీ ఇలా గంటల తరబడి పళ్లను రుద్దటం, గట్టి బ్రష్ తో తోమటం వల్ల దంతాల పైన ఉండే ఎనామిల్ అనే పింగాణీ పొర అరిగిపోవటం, చిగుళ్లు జారిపోవటం, దంత మూలం బయటపడటం, పళ్లు జివ్వుమనటం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పళ్లను శుభ్రం చేసుకునేటప్పుడు మెత్తటి బ్రష్ తో కేవలం రెండు నిమిషాల పాటు తోమితే చాలు. కానీ రోజుకు రెండుసార్లు బ్రషింగ్‌ చేయడం మాత్రం తప్పనిసరి.

దంతాల శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
దంతాలను ఎలాపడితే అలా శుబ్రం చేసుకోకూడదు. కింది వరుసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేయాలి. చాలా మృదువుగా బ్రష్ చేయాలి. మనం వాడే టూత్‌బ్రష్ బ్రిజిల్స్ దంతాలు, చిగుళ్ళను గాయపరచనంత మృదువుగా ఉండాలి. పళ్లకు మధ్య బ్రష్ చేరుకోని ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఫ్లాసింగ్ అనే ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్రషింగ్ ప్రక్రియను రెండు నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి. అదేపనిగా బ్రష్ నములుతూ బ్రష్ చేయకూడదు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం బ్రషింగ్‌తో పాటు నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడం కోసం టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. చిన్న పిల్లల దంతాల బ్రషింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. వారికి రఫ్‌గా బ్రష్ చేస్తే లేత చిగుళ్లకు హాని జరిగి వ్యాధుల బారిన పడే అవకాశముంది. వారికి చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేస్తే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపిల్లలు పళ్లు వచ్చిన నాటి నుంచే బ్రష్ చేయడం మొదలుపెట్టాలి. తల్లిదండ్రులు ఈ అలవాటును వారికి నేర్పించాలి. ప్రతి ఒక్కరు ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండుమూడు నిమిషాలు దంతాల పైనుంచి కిందకు, పైకి కదుపుతూ బ్రషింగ్ చేయాలి. చిగుళ్లు దెబ్బతినకుండా బ్రష్ చేయాలి. టూత్ పేస్ట్ లో ఘాటైనవి కాకుండా ప్లోరైడ్ లేనివి తీసుకోవాలి. డెంటిస్ట్ సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి ఆర్నెల్లకు ఓసారి స్కేలింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రం చేయించుకోవడం అవసరం.

దంతాల శుభ్రతకోసం ఎలాంటి బ్రష్ వాడాలి…?
పళ్లను శుభ్రం చేసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకున్న ప్రతీసారి మన దంతాల్లో కొంత పదార్థం ఇరుక్కుపోవడం సాధారణంగా జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత ఏదో మొక్కుబడిగా కాకుండా పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలిగిపోయేలా శుభ్రం చేసుకోవాలి. దంతాలను గంటల తరబడి తోమాల్సిన పనిలేదు. బ్రష్షుతో 2-3 నిమిషాల సేపు తోముకుంటే చాలు. ఎక్కువసేపు తోమితే పళ్ల మీద గట్టిగా ఉండే పింగాణీ పొర దెబ్బతింటుంది. కొసలు మృదువుగా ఉండే బ్రష్షులను ఎంచుకోవాలి. ఎగుడుదిగుడు పళ్లు గలవారు కొసలు లోపలివరకు వెళ్లే రకం బ్రష్షులను వాడుకోవాలి. బ్రష్‌ చేసుకున్నాక వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. దీంతో చిగుళ్లకు రక్తసరఫరా పెరిగి ఆరోగ్యకరంగా, దంతాలను బాగా పట్టుకునేలా ఉంటాయి.ఒకే బ్రష్షును ఏళ్ల కొద్దీ వాడటం మంచిది కాదు. 3 నెలలకు ఒకసారి తప్పకుండా బ్రష్షును మార్చాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించటం మంచిది. నోట్లో సులువుగా బ్రష్ చేసుకునే సైజువి వాడాలి. సెరామిక్ దంతాలు ఫిక్స్ చేయించుకున్న వారు హార్డ్ బ్రష్ వాడటం ఉత్తమం.బ్రసెల్స్‌ ఒంగిపోయి, నల్లబడితే అస్సలు వాడకూడదు. బ్రష్‌కున్న బ్రసెల్స్‌ సుతిమెత్తగా ఉండాలి. కరుకుగా ఉండకూడదు. బ్రష్‌ మీద పేస్టు వేసుకుని బరబరా పళ్లు తోముకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment