Health Tips – ఎముకలు బలహీనంగా ఉన్నాయా .. అయితే ఈ పరీక్ష తప్పనిసరి

By manavaradhi.com

Published on:

Follow Us
BONE MINERAL DENSITY TEST

మన శరీరం లోపల భాగం ఎముకల చేత నిర్మితమై ఉంటుంది. అలాంటి ఎముకలకు ఏదైనా సమస్య ఎదురైతే, మనం బలంగా నిలబడడం సాధ్యం కాదు. ఓ వయసు వచ్చిన తర్వాత, లేదా ఎముకలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తెలుసుకునేందుకు బోన్ డెన్సిటీ పరీక్షలు అవసరం అవుతాయి. ఈ పరీక్షలు ఎవరికి, ఏ పరిస్థితుల్లో అవసరం…!

బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఎముక ఖనిజ సాంద్రత పరీక్ష లేదా ఎముక సాంద్రత పరీక్షను బోలు ఎముకల వ్యాధి కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నిర్వహిస్తారు. సాధారణంగా మన శరీరం నిలబడేందుకు ఎముకే ఆధారం. ఇలాంటి ఎముక పూర్తి స్థాయిలో బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

ఎముక బలహీనంగా లేదా సన్నంగా ఉండడం వల్ల విరిగిపోయి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇది సమస్య మరింత పెరిగే వరకూ గుర్తించడం చాలా కష్టం అందుకే ఇలాంటి పరిస్థితిలో ఈ పరీక్ష మేలు చేస్తుంది. ఈ పరీక్ష ఎలాంటి నొప్పి లేకుండా వేగంగా నిర్వహిస్తారు. ఎక్స్ కిరణాలను ఉపయోగించి, ఎముకలు దట్టంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. ఎముకల్లో కాల్షియం ఎంత ఉంది, అదే విధంగా ఇతర ఖనిజాల స్థాయి ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకుంటారు. ఇవి దట్టంగా ఎక్కువగా ఉంటే సమస్య లేదు. అలా కాకుండా తక్కువ స్థాయిలో ఉంటే మాత్రం ఎముకలు విరిగేందుకు, అదే విధంగా లోపల పగిలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఓ వయసు వచ్చిన తర్వాత లేదా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయించుకోవడం అవసరం.

బోలు ఎముకల వ్యాధి ఎవరికైనా రావచ్చు. పురుషులతో పోల్చిచూస్తే మహిళల్లో ఈ సమస్య సర్వ సాధారణం. వైద్యుల సూచన మేరకు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ పరీక్ష చేయించుకోవాలి. 65 సంవత్సరాలు దాటిన స్త్రీలు గానీ, అదే విధంగా 50 సంవత్సరాలు దాటిని పురుషుల్లో గానీ ఈ పరీక్ష అవసరం అవుతుంది. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో ఎముకల బలం తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గనుక అలాంటి వారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి.

శరీరంలో నీరసానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నా, ఎముకల సమస్య గురించి తెలుసుకోవాలి. అలాగే ఎత్తు విషయంలో ఇబ్బందులు వచ్చినా, ఒకే భంగిమలో ఎక్కువ కాలం కూర్చునే వారు అయినా, ఏ కారణం లేకుండా శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు వస్తున్నా, గర్భవతి అయినా, హార్మోన్ సమస్యలు ఎదుర్కొంటున్నా, అదే సమయంలో ఏదన్నా అవయవ మార్పిడి జరిగిన వారైనా పరిస్థితిని బట్టి, వైద్యుల సలహా మేరకు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి వారిలో ఎముకల సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ గనుక, ఇలాంటి వారు పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.

బోన్ డెన్సిటీ పరీక్షల్లో వెన్నెముక, మక్కే, ముంజేతి ఎముకలకు పరీక్షలు నిర్వహిస్తారు. బోలు ఎముకల వ్యాధి కారణంగా విరిగే వాటిలో ఇవే ఎక్కువ. అందుకే వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు పరీక్షకు ముందు 24 గంటల పాటు కాల్షియం సప్లిమెంట్లు తీసుకోరాదు. అదే విధంగా సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ. కోసం చేసే ఇంజెక్షన్లు కూడా ఈ పరీక్షల మీద ప్రభావం చూపుతాయి.

మెటల్ లాంటివి ధరించడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. చాలా తక్కువ రేడియో ధార్మికత కలిగి ఉండే ఈ బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష ఎక్స్ రే తో పోల్చి చూసినప్పటికీ చాలా తక్కువ రేడియో ధార్మికత కిలిగి ఉంటుంది. ఈ పరీక్షలు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, అదే విధంగా వయసును బట్టి, అవసరాలను బట్టి వివిధ భాగాలకు నిర్వహిస్తారు.

ఇప్పటికే బోలు ఎముకల సమస్యలు ఉండి, దానికి సంబంధించిన మందులు తీసుకుంటూ ఉంటే మాత్రం ఏడాది నుంచి రెండేళ్ళకు ఒక సారి ఈ పరీక్షను చేయించుకోవాలి. అదే విధంగా ఈ సమస్య ఇప్పటి వరకూ లేని వారు, భవిష్యత్ లో పరీక్షల్లో కనపడని వారు ఎనిమిది సంవత్సరాలకు ఒక సారి ఈ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం. దీని పట్ల అవగాహనతో అవసరమైన పరీక్షలు చేయించుకుందాం. ఆరోగ్యాన్ని సత్వరమే కాపాడుకుందాం.

Leave a Comment