Epileps : ప్రతీ 26 మందిలో ఒకరికి మూర్ఛ… ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Epilepsy

నాడీవ్యవస్థ పైన ప్రభావం చూపించే వ్యాధి మూర్ఛ వ్యాధి. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి మూర్ఛ రావచ్చు. ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా మూర్ఛ రావచ్చు. అయితే సాధారణంగా మొదట పిల్లల్లోనూ, తరువాత యువకులైన పెద్దవాళ్లలోనూ వస్తుంది. ఇది ఒక శారీరక స్థితి మాత్రమే గాని మానసిక లోపం ఎంతమాత్రమూ కాదు. మెదడులోని న్యూరాన్లు శరీరం మొత్తానికి కదలికల్లో సాయం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరాన్ల నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయో దానినే మూర్చగా చెబుతారు.

ప్రారంభంలో మూర్చవ్యాధి లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు. ఆ తర్వాత క్రమంగా దీర్ఘకాలంలో పెరుగుతూ వచ్చి అపస్మారక స్థితికి దారితీస్తుంది. వ్యక్తికి, వ్యక్తికి మధ్య కూడా మూర్చ వ్యాధి తీవ్రత వేరువేరుగా ఉంటుంది. కొందరు స్పృహ కోల్పోతుంటారు. శరీరంలో వణుకును ఆపడం కూడా కొన్ని సమయాల్లో కష్టంగా మారుతుంది. మూర్చ సమస్య మొదలయ్యాక కచ్చితంగా రెండు మూడు మార్లు ఈ సమస్య ఎదురయ్యే లోపే వైద్యుని సంప్రదించడం ద్వారా సమస్య తీవ్రతను బాగా తగ్గించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ సమస్య మొదలయ్యాక దీర్ఘకాలిక చికిత్స అవసరం. కనీసం రెండేళ్ళయినా మూర్చ సమస్యకు చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

ఫిట్స్ తగ్గిన తర్వాత వారికి ఇతర విషయాలు గుర్తుండవు. ఈ సమస్య విషయంలో వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం తప్పనిసరి. రోగి చెప్పే విషయాలను బట్టి ప్రాథమికంగా సమస్య స్థాయిని అంచనా వేయవచ్చు. మెదడులోని ఏ భాగంలో లోపాలు ఉన్నాయో కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని చికిత్స చేయవలసి ఉంటుంది. ఏ పరీక్షలు అవసరమనే విషయాన్ని సమస్య తీవ్రత మేరకు వైద్యులు సూచిస్తారు. కొన్ని పరిస్థితుల్లో మందుల ద్వారానే 80 శాతం వరకు ఈ వ్యాధి నయమవుతుంది. కానీ కొందరిలో మాత్రం దీనికి ఏ విధమైన ఆస్కారం ఉండదు.

పెద్దవారి విషయంలో అనేక కారణాలు వల్ల మూర్చ వ్యాధి ఎదురౌతుంటే, ఈ సమస్యలేం లేకుండా జన్యు పరమైన కారణాలు, వ్యాధుల వల్ల పిల్లల్లో ఈ సమస్య వస్తోంది. పెద్ద వారితో పోలిస్తే పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మూర్చ వచ్చే ముందు కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయి. అందువల్ల పిల్లలకు మూర్చ లక్షణాల పట్ల ముందుగానే తెలియజేయాలి.

ప్రధానంగా ఇలాంటి విషయాల్లో వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా పిల్లలకు అంద జేస్తూ ఉండాలి. పెద్దవారి విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు వర్తించినప్పటికీ, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటూ, సరైన చికిత్స అందిచడం ద్వారా మూర్చ వ్యాధిని అధిగమించడం సాధ్యమవుతుంది. మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఉన్నట్టుండి మందులను ఆపేయకండి. దీనివల్ల నరాల సంబంధితమైన అత్యవసర పరిస్థితి అయిన ఎపిలెప్టికస్‌ని తొందరగా తీసుకురావచ్చు. ఏ మందుల వల్లనైనా దుష్ప్రభావాలు కలిగినా, సహించకపోయినా వెంటనే డాక్టర్‌కు చెప్పాలి. ఏకకాలంలో ఇతర వ్యాధులున్నప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు ఇతర మందులను నిలిపివేయడం గాని, తగ్గించడం గాని మీకు మీరుగా చేయకూడదు.

మూర్ఛ వ్యాధి ఉన్నవారు కార్లు, ద్విచక్రవాహనాలు నడపకూడదు. స్విమ్మింగ్ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం అంత మంచిది కాదు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స పొందడం ఎంతో ముఖ్యం.

Leave a Comment