ప్రస్తుం ఆధునికి కాలంలో మారుతున్న జీవన విధానం కారణంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో కిడ్నీ సమస్యలు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు..ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారంలో మార్పులు లాంటి కారణాల వల్ల ఈ సమస్యలు ఎదురౌతున్నాయి. కిడ్నీ సమస్యల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..
మూత్రపిండాలకు వచ్చే వ్యాధులు అదుపులోకి రానపుడు అవి పూర్తిగా పనిచేయలేని స్థితికి రావచ్చు. ఇలాంటి పరిస్థితినే కిడ్నీ ఫెయిల్యూర్‌గా పిలుస్తాం. ఇలాంటప్పుడు మూత్రపిండాలు రక్తాన్ని వడకట్టి వ్యర్థాలను బయటకు పంపలేవు. దాంతో వ్యర్థాలు రక్తంలో పేరుకుపోతాయి. శరీరంలో నీరు లవణాల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. మూత్రపిండాల వైఫల్యం రెండురకాలుగా ఉంటుంది. మొదటిది అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, రెండవది క్రానిక్. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య అకస్మాత్తుగా కలుగుతుంది. డీహైడ్రేషన్ కారణంగా తలెత్తే ఈ వ్యాధిలో వాంతులు, విరేచనాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రపిండాలు పనిచేయలేని దశకు చేరుకోవచ్చు. నిషేధించిన కొన్నిరకాల మందులు వాడటం వలన, విషపదార్థాలు తాగినా, పీల్చినా, శరీరంలో చాలా భాగం కాలినా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. మూత్రపిండాలకు సంబంధించిన రక్తనాళాలు గట్టిపడి, రక్తప్రసరణ తగ్గి..రక్తాన్ని శుభ్రంచేసే శక్తిని కోల్పోయినప్పుడు, ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉన్నపుడు కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించవచ్చు. ఇక రెండవది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సామర్ధ్యం తగ్గుతూ పోవడాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. మూత్రపిండాల్లో, మూత్రనాళాల్లో రాళ్లు, మధుమేహం అదుపు తప్పటం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం…ఈ కారణాల వలన ఈ వ్యాధి రావచ్చు.
మూత్రపిండాల పనితీరు లోపించడానికి కారణాలు అనేకం. మధుమేహం, హైబీపీ దీర్ఘకాలం కొనసాగడం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం… వంటి అనేక కారణాలు కిడ్నీలు ఫెయిల్ కావడానికి దారి తీస్తాయి. వీటితోపాటు 2నుండి 5 శాతం మందిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. మూత్రపిండాలు పని చేయడం మానేస్తే… మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా పోతుంది. అలాగే ఇవి పనిచేయకపోతే… కాళ్లకు నీరుపట్టి వాపు రావడం, ముఖం ఉబ్బినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, వాంతులు, నీరసం, చిన్నపాటి శ్రమకే ఆయాసపడడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రపిండాలు పనిచేయడం మానేసినప్పుడు ఆ పనిని బయటి నుంచి చేయించే ప్రక్రియ డయాలసిస్. ఈ ప్రక్రియని రెండురకాలుగా నిర్వహించవచ్చు. హీమో డయాలసిస్ ప్రక్రియలో రక్తాన్ని శుద్ధి చేయడానికి కృత్రిమ మూత్రపిండం సహాయం తీసుకుంటారు. ఒక దఫా డయాలసిస్ కు మూడు గంటలు పడుతుంది. వారంలో మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. మూత్రపిండానికి తక్కువ హాని జరిగితే డయాలసిస్ ద్వారా కొంతకాలానికి అవి బాగుపడవచ్చు. హానిఎక్కువగా ఉంటే మాత్రం మూత్రపిండాల మార్పిడి చేయాల్సి ఉంటుంది. కిడ్నీ ఫెయిలయిన వారికి మరొకరి కిడ్నీని అమర్చే ప్రక్రియనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. బతికి ఉన్నవారినుండే కిడ్నీని తీసి అమర్చడం ఒక విదానం అయితే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చే అవకాశం కూడా ఉంది.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో మనం నిత్యం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో ముందుగా రక్తపోటు, మధుమేహం రాకుండా చూసుకోవటంతోపాటు ఒకవేళ అవి ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే రోజుకి 5 నుంచి 6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచుకోవాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహై డ్రేషన్ కు గురవకుండా చూసుకోవాలి. జీవనశైలి, వాతావరణం, శరీర తత్వం, ఆహారపుటలవాట్ల ఆధారంగా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పు, నూనె, మాంసం లాంటివి తక్కువగా తినాలి. క్యాబేజి, క్యాలిఫ్లవర్, పాలకూర లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. రక్తపోటు, మధుమేహ బాధితులు వ్యాధిని నియంత్రణలో పెట్టుకుని వ్యాయామం చేయాలి. అప్పుడే మన కిడ్నీలను ఆరోగ్యం ఉంచుకోవచ్చు.