మన శరీరంలోని అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చూపు పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దానికి తోడు సిగరెట్ అలవాటు, స్థూలకాయం కూడా ఉంటే కంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. కంటికి కావలసిన పోషకాహారం తీసుకోకపోవటం, కంప్యూటర్ల వాడకం పెరగటం, సూర్యకాంతిలోని నీలలోహిత కిరణాల్లో సన్ గ్లాసులు లేకుండా తిరగటం, పెరుగుతున్న వయసు లాంటి పలుకారణాల వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి వ్యాధుల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. దీనినే ఎఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనికూడా అంటారు. కంటి మధ్య భాగం చూడలేని స్థితి చేరటం ఈ వ్యాధి ముఖ్యలక్షణం.
వయసు పెరుగుతుంటే శరీరంలోని అవయవాల సామర్ధ్యం తగ్గటం సాధారణ విషయమే. కళ్లు కూడా అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వివిధ సమస్యలకు గురవుతుంటాయి. అలా వచ్చే అనారోగ్యాల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. మాక్యులా అన్నది రెటీనాలోని అతి సున్నితమైన భాగం. ఇది కన్ను వెనుకభాగంలో ఉంటుంది. రెటీనా కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చిన తర్వాత నేత్రనాడి ద్వారా అవి మెదడును చేరతాయి. అక్కడ అవి దృశ్యాలుగా మారటంతో మనం కళ్లతో చూడగలుగుతాం. ఇక్కడ మాక్యులా ప్రధాన పోషిస్తుంది. రెటీనా మధ్యభాగంలో ఉండే ఈ మ్యాక్యులా కారణంగానే మనం చదవటం, డ్రైవింగ్ చేయటం, రంగులను మొహాలను గుర్తుపట్టటం లాంటి పనులను చేయగలుగుతాం. వయసు మీదపడటం వలన లేదా మరే కారణంగా అయినా మాక్యులా లోని కణాలు పాడైపోతే, కంట్లో దృశ్యాన్ని చూపించే భాగంలోని మధ్యభాగం మసకబారుతుంది. అంటే ఆ భాగం దృశ్యాన్ని చూపించే శక్తిని కోల్పోతుంది. దీన్నే మాక్యులర్ డీజనరేషన్ అంటున్నాం.
మాక్యులా లోని కణాలు పాడైపోవటంతో అది దృశ్యాన్ని సరిగ్గా తీసుకుని మెదడుకు పంపలేదు. దాంతో రెటీనా అంతా పనిచేస్తున్నా మాక్యులా పాడైపోయిన చోట మాత్రం దృశ్యం కనిపించదు. తొలిదశలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా రానురాను చూపు మరింత మసకబారుతూ, కళ్లు చూస్తున్న దృశ్యంలో మధ్యభాగం కనిపించని స్థితి ఏర్పడుతుంది. చూపు పూర్తిగా పోకపోయినా చూడలేని స్థితి ఇది. అందుకే దీన్ని దాదాపు అంధత్వమంత తీవ్రమైనదిగా చెప్పవచ్చు.
మాక్యులర్ డీజనరేషన్ లక్షణాలు మొదటి దశలో అంతగా బయటపడవు. రెగ్యులర్ కంటి పరీక్షలు చేసినపుడు రెటీనా పొరల్లో వెంట్రుక పరిమాణంలో కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు పేరుకుని ఉండటం కనబడుతుంది. వీటిని డ్రూసెన్ అంటారు. వీటి పరిమాణం, సంఖ్య పెరుగుతున్న కొద్దీ మాక్యులర్ డీజనరేషన్ సమస్య పెరుగుతుంటుంది. తొలిదశలో డ్రూసెస్ చాలా చిన్న పరిమాణంలోనే ఉంటాయి. వీటి ఉనికిని మాక్యులర్ డీజనరేషన్ మొదలవటంగా గుర్తిస్తారు. అయితే మొదటి దశలో చూపుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండోదశలో డ్రూసెన్ పరిమాణం పెరుగుతుంది, దాంతో పాటు రెటీనా రంగులో మార్పు కనబడుతుంది. కంటి పరీక్షల్లో మాత్రమే ఈ తేడాలు బయటపడతాయి. ఈ దశలో చూపు తగ్గుతుంది తప్ప ఇతర లక్షణాలు కనిపించవు.
మూడో దశలో డ్రూసెన్ మరింతగా పెరిగి మాక్యులా దెబ్బతింటుంది. ఈ దశలో చూపులో తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కంట్లో ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ లక్షణాలు ఉండి రెండో కన్ను ఆరోగ్యంగా ఉన్నవారిలో ఐదుశాతం మందిలో మాత్రమే సమస్య పదేళ్లలో తీవ్రదశకు చేరుకుంటుంది. అలా కాకుండా రెండు కళ్లలో లక్షణాలు కనబడితే 14శాతంమందిలో పదేళ్లలో ఒక కన్ను పూర్తిగా మాక్యులర్ డీజనరేషన్కి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఒక కన్ను మాత్రమే చివరిదశ మాక్యులర్ డీజనరేషన్కి గురయి రెండో కన్ను బాగున్నపుడు చదవటం, డ్రైవింగ్ లాంటివి చేసుకునే వీలుంటుంది. ఎంత త్వరగా కనిపెడితే అంతగా దీన్ని నివారించే అవకాశం ఉంటుంది కనుక కంటి చూపులో ఏమాత్రం తేడా ఉన్నా డాక్టరుని సంప్రదించడం మంచింది.
తొలిదశలో దీన్ని గుర్తిస్తే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తీసుకోవటం ద్వారా మాక్యులా కణాలు పాడవకుండా కాపాడుకోవచ్చు. కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్లు, ఖనిజాలను సప్లిమెంట్లుగా ఇస్తారు. మున్ముందు దీనికి మంచి చికిత్సని కనుగొంటారని భావిస్తున్నారు.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన మాక్యులర్ డీజనరేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని కంటి వైద్యులు చెబుతున్నారు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం, మల్టీవిటమిన్, మల్టీ మినరల్ సప్లిమెంట్లను వైద్య సలహాతో తీసుకోవటం, పొగ అలవాటుకి దూరంగా ఉండటం, చేపలు ఎక్కువగా తినటం లేదా చేపనూనెలను సప్లిమెంట్లు రూపంలో తీసుకోవటం, వ్యాయామం చేస్తూ బరువుని అదుపులో ఉంచుకోవటం, పళ్లు, గింజలు ఎక్కువగా తినటం, బిపిని కొవ్వుని నియంత్రణలో ఉంచుకోవటం, ఎండలోకి వెళ్లినపుడు సన్ గ్లాసెస్ని వాడటం, రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకోవటం…ఈ జాగ్రత్తలతో మాక్యులర్ డీజనరేషన్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది.
శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధాప్యం బాధపెట్టకుండా ఉంటుంది. వృద్ధాప్యంలో వాడుకునేందుకు డబ్బుని దాచుకున్నట్టే మంచి ఆరోగ్యాన్ని మిగుల్చుకోవాలి. అప్పుడే మాక్యులర్ డీజనరేషన్ లాంటి వయసుతో పాటు వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు.