Health Tips : రక్తనాళాల్లో స‌మ‌స్య‌లు ఎందుకు ఏర్పడతాయి ?

By manavaradhi.com

Published on:

Follow Us
Vein and Artery Problems

జీవుల్లో రక్తం ప్రసరణం చెందడం రక్తనాళాల్లో జరుగుతుంది. అవి ధమనులు, సిరలు. గుండె నుండి శరీర భాగలకు రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు. వివిధ శరీర భాగల నుండి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలే సిరలు. ఏదైనా సమస్య వచ్చి రక్తనాళల్లో అడ్డంకులు ఏర్పడితే.. రక్తం సరిగా సరఫరా కాదు. దీంతో సమస్యలు ఉత్పన్నమౌతాయి. రక్తనాళ సమస్యలు నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.

రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కవాటాల్లో ఉండే రక్తనాళాల్లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. రక్తనాళాలు కుచించుకుపోయి రక్తం ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీని వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గుండెకు వచ్చే సమస్యల్లో ప్రధానమైనవి కరోనరీ ఆర్టరీ వ్యాధులు. అంటే గుండెకు రక్తాన్ని అందించే మూడు కరోనరీ ధమనుల్లో కొలెస్ట్రాల్ కొవ్వుముద్దలు అడ్డుపడటం. వీటినే బ్లాక్స్ అంటారు. ఇవి చాలా ప్రమాదకరం. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది కాళ్ల‌లోని ర‌క్త‌నాళాల్లో పూడిక‌లు త‌లెత్తె ముప్పు కూడా ఎక్కువ‌వుతుంటుంది.

గుండె, మెదడుకు వెలుపల ఉండే రక్తనా ళాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు దానిని పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్ అంటారు. దీనిలో ప్రధానంగా జీర్ణకోశం, మూత్రపిండాలు, కాళ్లు, చేతులకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు కుంచించుకుపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతుంటాయి. ఇవి క్రమంగా గట్టిపడుతూ రక్తనాళాల లోపలి మార్గం సన్నబడేలా చేస్తాయి. ఫలితంగా కాలి కండరాలకు తగినంత రక్తం అందదు. దీంతో నొప్పి, మొద్దుబారటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే ముప్పూ పెరుగుతుంది.

మన గుండె నుంచి వెలువడే రక్తం ధమనుల ద్వారా ఆయా అవయవాలకు, కండరాలకు చేరుకుంటుంది. దీనిలోని ఆక్సిజన్‌, పోషకాలను కండరాలు గ్రహించిన తర్వాత మిగిలిపోయిన ‘చెడు’ రక్తం సిరల ద్వారా తిరిగి గుండెకు చేరుకుంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. గుండె బలంగా పంప్‌ చేయటం వల్ల ధమనుల ద్వారా రక్తం తేలికగానే ఒళ్లంతా ప్రవహిస్తుంటుంది. అయితే రకరకాల కారణాలతో కొందరిలో వీటి సామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో రక్తం కిందికి జారిపోతూ.. అక్కడే ఎక్కువగా నిల్వ ఉండిపోతుంటుంది. దీంతో రక్తనాళాలు ఉబ్బిపోతుంటాయి. పైకి తేలి పాముల్లా స్పష్టంగా కనబడుతుంటాయి. ఇదే సిరల ఉబ్బు. దీన్నే వెరికోస్‌ వీన్స్‌ అంటారు.

సుదీర్ఘంగా నిలబడి పని చేయడం, ఎక్కువ సమయం కూర్చోటం, ఒబేసిటి, హార్మోన్ల లోపం దీనికి కారణాలుగా చెప్పవచ్చు.సిరల్లో లేదా ధమనుల్లో ఉన్న రక్తం వేగం మందగించినప్పుడు గడ్డ కట్టడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. దీని వల్ల గుండె పోటు లేదా గుండె వ్యాధులు ఎదురౌతాయి. శరీరం లోపల రక్తం గడ్డ కట్టినప్పుడు… రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఆ ప్రదేశంలో వాపు రావడం, నొప్పిగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది. సిరల్లో రక్త గడ్డకట్టడాన్ని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు. . రక్తనాళాల్లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం వల్ల డీప్ వెయిన్ థ్రోంబోసిస్ కి కారణం అవుతుంది. సర్జరీ, గాయాలు, లేదా వ్యాధినిరోధకత లోపించడం వల్ల కూడా డీప్ వెయిన్ థ్రోంబోసిస్ కారణం అవుతుంది.

రక్తనాళాల్లో స‌మ‌స్య‌లు ఏర్ప‌డితే కొన్నిసార్లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్ప‌వు. అందుక‌ని ఏవైనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే వెంట‌నే వైద్యుడ్ని సంప్ర‌దించి చికిత్స పొంద‌డం ద్వారా ముప్పు నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. అంతగా ఇబ్బంది లేనప్పుడు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తనాళా సమస్యల నుంచి బయటపడవచ్చు.

Leave a Comment