Osteoposis : ఆస్టియోపొరోసిస్‌ – చిన్న దెబ్బ తగిలితేనే ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది

By manavaradhi.com

Published on:

Follow Us

వృద్ధాప్యంపైబడుతున్నకొద్దీ వ్యాధులు ఒకదానిని మించి ఒకటి దాడిచేస్తుంటాయి. వీటిలో ఆస్టియోపొరోసిస్‌ ఒకటి. ఒక్క భారత దేశంలోనే సుమారు 60 మిలియన్ల మంది ఈ వ్యాధితో బారిన పడుతున్నారని అంచనా. వృద్ధుల్లో ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఈ సమస్య రావడం .. ఫ్రాక్చర్‌లు తొందరగా అయ్యే అవకాశాలుంటాయి. ఈ వ్యాధి మధ్య వయస్సు, వృద్ధాప్యంలో కనిపించినప్పటికీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి, వెన్నుముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి.ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, విటమిన్ డి లోపం ఉన్న వారిలో, పౌష్టికాహార లోపం ఉన్న వారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్న వారిలో ప్రైమరీ టైప్ కనిపిస్తుండగా… 75 సంవత్సరాల వయసు పైబడిన వారిలో సెకండరీ ఆస్టియోపొరోసిస్ కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. ఇదే సమయంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురైతే… ఎముకలు గుళ్లబారిపోయి విరిగిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలితేనే ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది. స్త్రీ ఎముకలు బలహీనంగా ఉంటున్నందున పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో చాలా సాధారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది.

ఎముకలలో సామర్ధ్యం, సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ జబ్బు వస్తుంది. ఎముకలు పెళుసుగా తయారై.. ఫలితంగా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు విరిగే వరకు మీరు ఆస్టియోపొరోసిస్ తో బాధపడుతున్నారనే విషయం తెలియదు. స్త్రీలలో ఎముకలను ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది. ఎముకలు బలహీనానికి కారణమయ్యే మేనోపాజ్‌కి చేరినప్పుడు ఈస్ట్రోజెన్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా స్త్రీలలో ఈ వ్యాధి రావడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది. కాల్షియం మరియు విటమిన్ D ల లోపం కూడా, ఎముకలు బలహీనపడడానికి ఒక కారణం కావచ్చు. హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సీఓపీడీ వ్యాధికి గురైనప్పుడు, అధిక మద్యపానం, సిగరెట్లు తాగడం, కొన్ని రకాల మందుల వద్ద ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దాశలో గుర్తించడం చాలా వరకు జరగదు. ఈలోపు ఎముకలకు జారగాల్సిన నష్టం జరిగిపోవడం, చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు విరిగే పరిస్థితి తలెత్తుతుంది. డ్యూయల్‌ ఎనర్జీ ఎక్స్‌రే అబ్జార్‌ప్సమెట్రీ పద్ధ్దతిలో అది ఆస్టియోపోరోసిస్‌ అన్న విషయాన్ని నిర్థారిస్తారు. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటి ఎముక భాగాలను ఈ బోన్ డెన్సిటో మీటర్ ద్వారా పరీక్షిస్తారు.

ఆస్టియోపొరోసిస్ నిర్మూలనకు సరైన జీవనశైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత కాల్షియం, విటమిన్ D అవసరం. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతో పాటు తగినంత క్యాల్షియం, విటమిన్‌ డి తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అందేలా చూసుకోవాలి. రోజూ కాసేపు ఎండలో గడిపడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ప్రోటీన్ అధిక శాతం కలిగి ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్ధాలు తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ B6, B12, ఫోలేట్ అధికంగా ఉండే గుడ్డును రోజువారి మెనూలో చేర్చుకోవాలి.ఆస్టియోపొరోసిస్ కి ఆపిల్, ఆరంజ్, పియర్,అరటిపండు, నిమ్మ, పాలకూర, అల్లం చాలామంచి ఆహార పదార్ధాలు. చిక్కుళ్ళు, సోయాబీన్స్ స్త్రీలలో ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి, ఆస్టియోపొరోసిస్ సమస్యను తగ్గిస్తాయి

Leave a Comment