Foot Care Tips : పాదాలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలు.. జాగ్రత్తలు

By manavaradhi.com

Published on:

Follow Us
Foot Care Tips

మనల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. నిజానికి 40 ఏళ్లు పైబడినవారిలో దాదాపు 80% మంది పాదాలకు సంబంధించి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారేనని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల పాదాల ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

మనం నడవడానికి పాదాలే కీలకం. ఇంట్లో చిన్న పాటి పనులు చేసుకోవాలన్నా పాదాల ఇబ్బందులతో ముందుకు కదల లేని పరిస్థితి. దీనికి కారణం పాదాల సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు పట్టించుకోక పోవడం. దీని వల్ల సమస్యలు తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. పాదాల సమస్యల్లో ప్రధానం చెప్పుకోవలసింది నొప్పుల గురించే. వీటి గురించి ప్రారంభంలోనే అవగాహన తెచ్చుకోవడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఇందులో మొదటగా చెప్పుకోవలసింది మడమ నొప్పి గురించే. మడమను, ఎముకను కలిగే కఠినమైనన కణజాలంలో వాపు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర లేచిన వెంటనే ఈ సమస్య బాధిస్తుంది. మడమ వంపులో ఈ సమస్య ఉందంటే కచ్చితంగా అది వాపు కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పాదాలకు విశ్రాంతి ఇవ్వాలి. మంచి చెప్పులు ధరించాలి. దీని వల్ల సమస్యను అధిగమించవచ్చు. మడమను తాకి ఉండే పాదం నొప్పి. ఇది అసహజమైన నడక లేదా, సౌకర్యం లేని చెప్పుల వల్ల ఇబ్బంది పెడతాయి. అధికంగా మార్నింగ్ వాక్ చేసే వారికి ఈ సమస్యలు ఎదురు కావచ్చు. నొప్పి నివారణ చర్యలు, పాదాల విశ్రాంతి, చికిత్స లాంటి ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఎక్కువ కాలం సమస్య బాధిస్తుంటే వైద్యుని సంప్రదించడం తప్పనిసరి.

పాదాలకు సంబంధించిన కీళ్ళలో వచ్చే సమస్యలు తీవ్రమైన గౌట్ లాంటి నొప్పులను కలుగ జేస్తూ ఉంటాయి. బొటన వేలు ఈ సమస్యకు అధికంగా ప్రభావితం అవుతుంది గనుక… అడుగులు వేసేటప్పుడు ఈ సమస్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బొటన వేలు మొదల్లో ఉబ్బడం లాంటి సమస్య సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఎదురౌతాయి. ఇలాంటి వాటి విషయంలో శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. ముఖ్యంగా గౌట్ లాంటి సమస్యల్లో కండరాల అసమతౌల్యత నుంచి పాదాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. అదే విధంగా మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారి విషయంలో పాదాలు మరింత జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పనిసరి.

పాదాలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో మడమ ఫ్రాక్చర్ ఒకటి. ప్రమాదాల ద్వారా ఎదురయ్యే ఈ సమస్యలో కాల్లో ఉండే ఎముక పగిలి పోతుంది. దీని వల్ల మడమనొప్పి, వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి ఎదురు కావచ్చు. ఈ సమస్య ఎదురైనప్పుడు మడమ మీద ఒత్తిడి లేకుండా చూడాలి. మెత్తని వస్తువు ధరించి మడమను కాపాడుకోవాలి. అదే విదంగా నొప్పి నివారణ ఔషధాలు వాడాలి. శస్త్ర చికిత్స లాంటివి అవసరం కావచ్చు. వైద్యుని సంప్రదించడం ద్వారా నొప్పి నివారణ చర్యలు పాటించవచ్చు. అలాగే మోర్టాన్ న్యూరో మ సమస్యలు కాలి వేళ్ళకు ఎదురౌతాయి. వేళ్ళ మధ్య ఉండే నరాల చుట్టూ కణజాలం గట్టిపడడం వల్ల ఈ సమస్య ఎదురౌతుంది. దీని వల్ల తిమ్మిరి లాంటి ఇబ్బందులు వస్తాయి. అధికంగా మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. వైద్యుని సంప్రదించి సరైన మందులు తీసుకోవడం, నొప్పి నివారణ చర్యలు పాటించడం చేయాలి.

పాదాలను కాపాడుకోవటం షూ ఎంపిక నుంచే మొదలెట్టాలి. పాదం వంపు వద్ద మంచి దన్ను, మడమ కింద కాస్త మెత్తగా ఉండే షూ ఎంచుకోవటం మేలు. అలాగే మడాలు మరీ ఎత్తుగా లేకుండానూ చూసుకోవాలి. వేళ్లు లోపలి వైపులకు నొక్కుకుపోకుండా ముందు భాగంలో తగినంత స్థలం ఉండే షూ తీసుకోవాలి. ఎత్తుమడాల చెప్పులతో పాదాల నొప్పి మాత్రమే కాదు.. వేళ్ల వద్ద బొబ్బలు, వేళ్లు వంగిపోవటం, మడమ నుంచి వేళ్ల వరకూ విస్తరించి ఉండే కణజాలం పొర వాపు, గోళ్లు లోపలి వైపునకు పెరగటం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది. అందువల్ల మడాలు మరీ ఎత్తుగా ఉండే చెప్పులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వీలైనప్పుడల్లా పాదాలను కాస్త సాగదీయటానికి ప్రయత్నించండి. దీంతో నొప్పి తగ్గుముఖం పడుతుంది. బిగుతుగా అయిన కండరాలు, కండర బంధనాలు సాగి వదులవుతాయి. ప్రతిరోజూ సబ్బు, గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ల మధ్య తడిలేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. దీంతో ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పాదాల ఆరోగ్యమూ మెరుగవుతుంది. నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివన్నీ పాదాల కండరాలు తేలికగా కదలటానికి, బలోపేతం కావటానికి, రక్తప్రసరణ మెరుగవటానికి తోడ్పడతాయి.

తలనొప్పి వంటివి వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తుంటారు… కానీ పాదాల్లో నొప్పి తలెత్తితే పెద్దగా పట్టించుకోకుండా అలాగే తిరిగేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పాదం కూడా శరీరంలో ఒక భాగమనేనన్న విషయాన్ని గుర్తుంచుకొని అవసరమైతే డాక్టర్ ను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి.

Leave a Comment