whole grains : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!

By manavaradhi.com

Published on:

Follow Us

మనం ఇప్పుడు తింటున్న ఆహారాల్లో ఏ ఒక్కదాంట్లో సరైన పోషక విలువలు ఉండడం లేదు. అంతా ప్రాసెస్డ్ ఫుడ్డే. నిల్వ సరిగా ఉండదు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా ఒక రకంగా మనం విషాహారాన్నే తింటున్నాం. దీనికంతటికీ కారణం మన జీవనశైలే. సంపూర్ణమైన ఆరోగ్య జీవితాలు పొందాలి అంటే మనం కచ్చితంగా తృణ ధాన్యాల వైపు అడుగులు వేయాల్సిందే. చిరు ధాన్యాలను తృణధాన్యాలు, సిరి ధాన్యాలు అని కూడా అంటారు. కొర్రలు, రాగులు, సామలు, అరికలు, జొన్నలు, సజ్జలు, వరిగలను తృణధాన్యాలు అంటారు.

ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే ఆహారంలో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులు, మినరల్స్, మైక్రో న్యూట్రిషియంట్స్ స‌మ‌పాళ్ల‌లో ఉండాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో ఇవి అస్త‌వ్య‌స్తంగా ఉంటున్నాయి. పాలిష్ చేయ‌బ‌డిన బియ్యంలో మొత్తం కార్బొహైడ్రేట్లే ఉంటాయి. ఫైబ‌ర్ ఉండ‌దు. ఇక మ‌నం తింటున్న జంక్ ఫుడ్‌లో కొవ్వులు మాత్ర‌మే ఉంటాయి. ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. దీనివ‌ల్ల పోషకాహార లోపం వ‌స్తుంది. అలా కాకుండా మనం కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే సహజమైన పోషకాలు లభ్యమయ్యే తృణధాన్యాలు తీసుకోవాలి.

తృణ ధాన్యాల‌ను వారంలో క‌నీసం 3 రోజులు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. దాంతో పోష‌కాలే కాదు, ఆరోగ్యం కూడా ల‌భిస్తుంది. జొన్నలు పొట్టు తియలేం, గ్లూటన్‌ ప్రొటిన్‌ ఉండదు. దీని వల్ల ఎలర్జీ రాదు. జీర్ణకోశం, అలర్జీ, ఆహారపు అలర్జీ సమస్యలున్న వారు వాడితే మంచిది. సజ్జల్లో ఐరన్‌, పీచు, కాల్షియం, కొవ్వు ఎక్కువ మోతాదులో ఉంటాయి. నిత్యం వరి అన్నానికి బదులు వీటిని తీసుకోవడం మంచిది. అలాగే బరువు తగ్గాలి అనుకోనేవారికి , మధుమేహ బాధితులకు ఉపయోగపడుతుంది. రాగుల్లో అయోడిన్‌, కాల్షియం, యాంటి ఆక్సిడెంట్స్‌ చాలా ఎక్కువ. కాల్షియం దాదాపు పాలతో సమానంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో భాదపడుతున్నవారికి రాగి జావ చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి రాగులు ఇవ్వడం మంచిది.

కొర్రల్లో పీచుపదార్థం, మాంసకృత్తులు ఎక్కువగా లభిస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారికి , కార్డియోవాస్క్యులర్‌ సమస్యలతో బాధపడేవారికి కొర్రలు ఎంతో మేలు చేస్తాయి. అరికల్లో అధికంగా పీచుపదార్థం, ప్రొటిన్లు, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు ఉంటాయి. మహిళలకు మంచి శక్తిని ఇస్తాయి. శరీర శ్రమ లేకుండా.. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారు అరికలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఊదల్లో పీచు పదార్థాలు, ఫాస్పరస్‌, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు చాలా మేలు చేస్తాయి అంతేకాదు చాలా తేలికగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య నివారణ అవుతుంది. గర్భిణులకు, బాలింతలకు మంచిది. వరిగలల్లోమాంసకృత్తులు, బి6 విటమిన్‌ ఎక్కువ పాళ్ళలో లభిస్తాయి. చిగుళ్ల సమస్య నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

తృణ ధాన్యాలలో ఇనుము, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తృణ ధాన్యాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లల ఎదుగుదలకు, వృద్ధులలో, మహిళల్లో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి తోడ్పడుతాయి. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై, శోషితం కాకుండా చేయడం ద్వారా ఆహారంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదల అవుతాయి. కాబట్టి మధుమేహ రోగులకు ఇవి మంచి ఆహారం.

తృణ ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. ఏవైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా నయం అవుతాయి. పార్కిన్‌సన్, మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి. తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అనీమియా వ్యాధి నివారించబడుతుంది. మనలోని వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. నిద్ర‌లేమి వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. అధిక కొవ్వు త‌గ్గుతుంది. తృణధాన్యాలు పొట్టు తియకుండా తినడం వల్ల మంచి కొవ్వు ఎక్కువగా లభిస్తుంది. గర్భిణులు మొలకెత్తిన రాగులు, జోన్నలు, సజ్జలు తింటే పాలు బాగా పడతాయి. తృణ ధాన్యాలతో చేసిన పదార్థాలను చాలా సేపు నమలడం వల్ల తక్కువ మోతాదులో తింటారు. దీంతో తీసుకునే ఆహారం పరిమాణం తగ్గి బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

రంగుల ఆహారానికి అలవాటు పడి రతనాల్లాంటి తృణధాన్య ఆహారానికి దూరమౌతున్నాం. దీంతో ఇంట్లోనూ.. ఒంట్లోనూ ఆరోగ్య సమస్యలు అంటిపెట్టుకుని ఉంటున్నాయి. బియ్యాన్ని తగ్గించి తృణధాన్యాలు తినండి. ఇప్పుడు తింటున్న దోశ.. వడ.. ఊతప్పం.. ఇడ్లీ అన్నీ తినొచ్చు.. కాకపోతే అవి తృణధాన్యాలతో చేసినవి తింటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.

Leave a Comment