Tea or Coffee: టీ vs కాఫీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits of Coffee and Tea

పొద్దున్నే నిద్ర లేవగానే టీ లేదా కాఫీ త్రాగనిదే చాలా మందికి రోజుమెుదలౌవదు. మనిషి జీవితంలో వీటి పాత్ర అమోఘమైంది. కాస్త తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. అసులు టీ, కాఫీ తీసుకోవాడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి… వీటిని ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది అనే సందేహాలు చాలా మందికి కలుగుతాయి.

మ‌నలో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌గానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇక రోజులో కొంద‌రు ఎన్ని సార్లు కాఫీ, టీలు తాగుతారో లెక్కే ఉండ‌దు. కొంద‌రు మాత్రం కేవ‌లం ఉద‌యం, సాయంత్రానికే ప‌రిమిత‌మ‌వుతారు. ఇక కొంద‌రు ఉద‌యం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు తాగుతారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కేవ‌లం కాఫీకి మాత్ర‌మే ప్రాధాన్య‌త‌ను ఇస్తే.. కొంద‌రు మాత్రం కేవ‌లం టీ మాత్ర‌మే తాగుతుంటారు. సహజంగా టీ నరాల ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది.

టీ లేదా కాఫీలను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హెర్బల్ టీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాఫీ వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది. ఒత్తిడి వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అలాంటి సమయంలో ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే చాలు చక్కగా పని చేస్తుంది.

టీ పొడిని తేయాకు చెట్ల నుంచి తయారు చేస్తారు. టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అయితే అపాయకారి మాత్రం కాదు. టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.

టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్ ఈర‌కం తేనీళ్లలో తక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌ నిరోధానికి, ఊబకాయాన్ని నివారించడానికి గ్రీన్‌టీ, బ్లాక్‌టీలు మంచివని వైద్యులు సూచిస్తారు. టీ సేవ‌నం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. టీ లో పాలిఫినాల్స్ ఉన్నందున స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మీరు విసిగి మరియు అలిసిపోయినప్పుడు ఒక కప్పు మూలికా టీని తాగవచ్చు. వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మూలికలలో మన శరీరానికి మంచిచేసే అనేక ఔషదగుణాలు ఉంటాయి.

కాఫీ తాగగానే మెదడుకు ఎక్కడలేని చురుకుదనం వస్తుంది. కెఫిన్ అనే పదార్ధం మెదడు కణాలను ప్రభావితం చేయగలదు. దీంతో అవి బాగా ఉత్తేజంగా పని చేస్తాయి. మెదడుకు అవసరమయ్యే ఆక్సిజన్, రక్త సరఫరాను పెంచే సామర్థ్యం కూడా కెఫిన్ కు ఉంటుది. అందువల్ల బ్రెయిన్ కాస్త చురుగ్గా పని చేయాలంటే ఆ సయమంలో కాఫీ తాగితే సరిపోతుంది. కెఫిన్ మెదడు కణాలు ప్రభావితంగా పని చేస్తాయి. మెదడు కణాలు మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తి పెంచడానికి, మన నాలెడ్జ్ పెంచడానికి బాగా పని చేస్తాయి.

కాఫీ తాగే వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు ఉండవు. డెమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులకి మనం కాస్త దూరంగా ఉండవచ్చు. కాఫీలో ఆరోగ్యకరమైన అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి కంటి కణాలు ఉత్తేజంగా పని చేసేలా చేస్తాయి. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలంగా రెటీనా ఆరోగ్యకరంగా ఉంటుంది. కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది. కాఫీ మనిషిలో త్వరగా స్పందించే గుణాన్ని, ఆలోచించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నిస్సత్తువను మాయం చేసి దాని స్థానంలో ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.

కాఫీ… టీలు ఎక్కువగా త్రాగడం వల్ల మనిషిలో ఆకలి చచ్చిపోతుంది. టీ కాఫీలు ఎక్కువగా త్రాగడం వల్ల ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఈ ఆక్సిడెంట్లు ఎక్కువైతే క్యాన్సర్‌ మరియూ ఉబకాయం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. టీ ఎక్కువగా త్రాగడం వల్ల నిద్ర పట్టదని పెద్దలు చెప్తుంటారు. కావున టీ ఎక్కువగా త్రాగడం వల్ల నిద్ర లేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.

టీ మరియు కాఫీ వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది. కాఫీని ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. రోజుకి ఒకటి ..రెండుసార్లు మాత్రమే టీ లేదా కాఫీ తాగితే మంచిది.

Leave a Comment