Leafy Greens : ఆకు కూరలతో అద్భుతమైన ప్రయోజనాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Leafy Greens

మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే ఆకుకూరల్లో ఎన్నో ఔషధగుణాలు, పోషకాలున్నాయి. ఆకు పచ్చని ఆకుకూరలు చూడడానికి.. ఎంత అందంగా ఉంటాయో వాటిని ఆరగిస్తే కూడా మానవ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. విటమిన్‌ లోపం ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, గర్భిణులు ఇలా అందరూ ప్రతి రోజు తీసుకునే భోజనంలో ఆకు కూరలు ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఆకుకూరల వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.

ప్రకృతి మనకు ఇచ్చిన ఆరోగ్య వరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తుంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకు కూరలు కలిగి ఉంటాయి. పచ్చని ఆకు కూరలను ఆహారం నుంచి ఎప్పుడూ మినహాయించకూడదు. ప్రతి రోజూ వాటిని తినాల్సిందే.

ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలతో పాటు కంటి చూపుకు అవసరమైన విటమిన్లు సైతం అందుతాయి. అందుకే ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకునే వారికి మంచి కంటిచూపు లభిస్తుంది. అలాగే శరీరంలో ఏర్పడే రక్తహీనత నుంచి కాపాడుకోవడానికి కూడా ఆకుకూరలు ఉపయోగపడుతాయి. ఆకుకూరల్లో ఉండే ఇనుము వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి వీలు ఏర్పడుతుంది

ఆకుకూరలను మనం ఎందుకు ఆహారంలో భాగం చేసుకోవాలి ?
ఆకుకూరలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె పనితీరు సైతం మెరగుపడే అవకాశముందని ఇటీవలి పరిశోధనల్లో కనుగొన్నారు. క్రమం తప్పకుండా ఆకుకూరలన్ని తినడం వల్ల భవిష్యత్‌లో గుండె సమస్యలు వచ్చే అవకాశాల్ని చాలావరకు తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కరివేపాకు సాధారణంగా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకు వలన మానవ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ నివారణకు ఎక్కువగా దోహదపడుతుంది. మలబద్ధక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి కరివేపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ప్రముఖ అవయవమైన కాలేయాన్ని ఉత్తేజ పరచడంలో కరివేపాకు ముఖ్యపాత్రం పోషిస్తుంది.

కొత్తిమీరను సాధారణంగా మనం ప్రతి వంటకంలో ఎక్కువగా ఉపయోగిస్తాము. కొత్తిమీరమనిషి ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా విరేచనాలతో బాధపడేవారు కొత్తిమీరను తింటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

ముల్లంగి అనేది ఆకు కూరకన్న దుంపగా ప్రావీణ్యం పొందింది. ముల్లంగి ఆకును కూడా కూరగా వండుకొవచ్చు… ముల్లంగి సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. ముల్లంగి తినడం వలన శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరిగి, రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీర గాయాలకు మందుగా కూడా పనిచేస్తుంది.

  • గోంగూరలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • చుక్కకూరలో విటమిన్‌ ఎ, మెగ్నీషియం ఉంటుంది. గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది.
  • పాలకూరలో విటమిన్‌ ఎ, క్యాల్షియం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు ఉపయోగపడుతుంది.
  • తోటకూరలో యాంటి ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఐరన్‌ ఉంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. రక్తకణాల ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది.
  • బచ్చలి కూరలో విటమిన్‌ ఎ, సి, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కొత్తగా రక్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • పొన్నగంటి కూరలో అధిక విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకు కూర కంటిచూపు మెరుగుపరచడంతోపాటు శరీరానికి ఎంతో చల్లదనాన్నిస్తుంది. కడుపులో పెరిగిన కలుషితాలను సైతం నశింపజేయడంతోపాటు ఈ కూరను పొడిగా చేసి పప్పు, వేపుడు మాదిరిగా వివిధ రకాలుగా వండి తినవచ్చు.
  • మునగాకులో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌, కాపర్‌ ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గుతుంది.
  • మెంతి కూరలో పీచుపదార్థం ఉంటుంది. మధుమేహులకు, అధిక బరువుకు, గుండె ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి మంచిది.

రోజువారీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చగా ఉండే ఆకుకూరలను భోజనంలో భాగంగా తీసుకునే వారికి ఇతరులతో పోలిస్తే మంచి పోషకాలు శరీరానికి అందడంతో పాటు వారి ఆరోగ్యం సైతం చక్కగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Leave a Comment