Protein Rich Foods: వీటిని తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది

By manavaradhi.com

Published on:

Follow Us
Top 10 protein foods

జీవక్రియల పనితీరుకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అలాగే గుండె పదిలంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి దోహదం చేస్తాయి. అయితే ప్రొటీన్లను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని, కిడ్నీ సంబంధిత సమస్యలొస్తాయని…ఇలా ప్రొటీన్ల విషయంలో చాలామందిలో ఎన్నో అపోహలున్నాయి. ఫలితంగా ఎంతోమంది వీటిని దూరం పెడుతున్నారు. శరీరానికి పోషకాలు అందాలంటే అవి విటమిన్స్, ప్రోటీన్ల ద్వారానే సాధ్యమవుతుంది.

ప్రొటీన్లు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా ఎముకలు, కండరాలను, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పోషకాలు ఎంతో అవసరం. వివిధ ప్రమాదాల కారణంగా శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రొటీన్లు బాగా తోడ్పడతాయి. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి అన్ని వయసుల వారూ ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

కార్బోహైడ్రేట్లూ, కొవ్వుని నిల్వ చేసుకున్నట్టుగా శరీరం ప్రొటీన్లు నిల్వ చేసుకోదు. దాంతో ఏ రోజుకారోజు మనం ప్రొటీన్‌ నిండిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలా తీసుకోకపోతే మన శరీరం మన కండరాల నుంచి వాడుకుంటుంది. అదే జరిగితే శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.

ఒక రకంగా శరీర నిర్మాణానికి ఈ ప్రొటీన్లులే మౌలికం. శారీరక దృఢత్వం, సామర్థ్యం బాగుండేందుకు ప్రొటీన్లు తప్పనిసరి. అలాగే జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ సజావుగా పని చేసేందుకు కూడా ఈ ప్రొటీన్లు అవసరం. ప్రొటీన్లు జంతు సంబంధ ఆహార పదార్థాలైన పాలు, గుడ్లు, మాంసం, చేపల ద్వారా దండిగా లభిస్తాయి. ఇక వృక్ష సంబంధ శాకాహార పదార్థాల్లో రకరకాల పప్పులు, చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో జంతు సంబంధ పదార్థాల నుంచి వచ్చే ప్రొటీన్లు నాణ్యంగా ఉంటాయి, చక్కగా ఒంటబడతాయి కూడా.

మన శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలన్నీ జంతు సంబంధ ప్రొటీన్లల్లో దండిగా, అదీ సరైన పాళ్లలో లభిస్తుండటమే దీనికి కారణం. శాకాహార పదార్థాల నుంచి ఇంత సమృద్ధిగా లభించవనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో కొన్నికొన్ని అమైనో ఆమ్లాల స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగని శాకాహారులు తమకు ప్రొటీన్లు లభించవని అపోహ పడాల్సిన పనేం లేదు. నిత్యం తమ ఆహారంలో కంది, శెనగ వంటి పప్పులు.. గోధుమ వంటి తృణధాన్యాలు.. సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవటం ద్వారా అన్ని రకాల అమైనో ఆమ్లాలనూ పొందొచ్చు, వీటి ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు చాలా వరకూ లభిస్తాయి.

వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ వయసుని బట్టి, శరీరాన్ని బట్టి రోజుకు సరాసరిన 46 గ్రాముల ప్రొటీన్ పొందాలి. అదే విధంగా పురుషులకు 56 గ్రాముల ప్రొటీన్ అవసరాలు ఉంటాయి. మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఈ ప్రొటీన్ కాస్త తక్కువే అందాలి. అదే విధంగా రోజంతా మనం తీసుకునే ఆహారంలో కేలరీల కంటే ప్రొటీన్లు బాగా ఉండేలా చూసుకోవాలి. దీని మీద ఆధారపడే శరీరానికి ప్రొటీన్ అందించే ప్రయత్నం చేయాలి. కంది, పెసర, మినుము, శెనగ, వేరుశెనగ, బఠాణీ వంటి పప్పుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవచ్చు.

ప్రతి పూటా ఆహారంలో ఇలాంటివి ఏదో ఒకటి, అదీ మొత్తం ఆహారంలో కనీసం నాలుగో వంతైనా ఉండేలా చూసుకోవటం అవసరం. మంచిది కదా అని మరీ ఎక్కువగా ప్రోటీను పదార్థాలే తినటం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ. వీటిని అవసరానికి మించి అతిగా తింటే కిడ్నీల మీద భారం ఎక్కువగా పడుతుంది. ఒకవేళ ఎవరైనా కావాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంటే కిడ్నీల మీద భారం పడకుండా ఉండేందుకు నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండాలి. ఏ రకం ఆహారమైనా అవసరానికి మించి తింటే ఆ మిగిలిన శక్తి అంతా కొవ్వు రూపంలో ఒంట్లో చేరి, బరువు పెరిగిపోతారు. కాబట్టి అతిగా అదే తినక్కర్లేదుగానీ అవసరమైనంత ఉండేలా చూసుకోవటం మాత్రం చాలా అవసరం.

ప్రోటీన్ శక్తి శరీరానికి చాలా అవసరం. కాబట్టి మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లను పోషకాహార నిపుణుల సలహా ప్రకారం తీసుకోండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం లేకపోయినప్పటికీ.. ఇప్పటికే కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వీటిని మితంగానే తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Leave a Comment