తెల్లారి లేస్తే ఎలా బతకాలా అని ఒకప్పుడు ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆరోగ్యంగా ఎలా బతకాలా అని ఆరా తీస్తున్నారు. కాలం మారింది. రోగాలు పెరిగాయి. జీవనవిధానంలో మార్పులు వలన సమస్యలూ పెరిగాయి. వీటన్నింటికీ పరిష్కారం మీ భోజనంలోనే ఉంది. భోజనంలో భాగంగా కొందరు అన్నం తింటారు, కొందరు చపాతీలు తింటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. కానీ అందరూ కూరలు తినాల్సిందే. ఆ కూరల్లోనే ఆరోగ్యం ఉందంటున్నారు ఆహార నిపుణులు. వండుకునే కూరలో ఆకుకూరలను భాగంగా చేసుకోవడం వలన అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చు. ఏయే ఆకుకూరలు తింటే ఏ రోగాలు కుదుటపడతాయి.
పచ్చటి ఆకుకూరలు చూస్తే కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో శరీరానికి అంతే ఆరోగ్యకరం అంటున్నారు ఆహారనిపుణులు. మార్కెట్లో అన్ని సీజన్లలోనూ అందుబాటు ధరల్లో దొరికేవి, శరీరానికి మంచి పోషకాలు అందించేవి ఆకుకూరలే. మాంసాహారంతో పోల్చుకుంటే కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎలా మంచిదో.., కూరగాయలతో పోల్చుకుంటే ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం అంతే మంచిది. ప్రతిరోజూ మనం తినే మొత్తం ఆహారంలో 20 శాతం అయినా ఆకుకూరలు ఉండాలి అనేది న్యూట్రిషియన్లు చెప్పేమాట. అసలు ఆకుకూరలే మేం తినం అని కొందరు అంటుంటారు. కానీ అందరి ఆహారంలోనూ ఏదో ఒక విధంగా ఆకుకూరలు ఉంటాయి.
మన వంటకాల్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు లాంటివి సాధారణంగా వాడేవే. వీటివలన వంటలకు రుచితో పాటు శరీరానికీ అనేక పోషకాలు అందుతున్నాయి. ఇక క్యాబేజ్, కాలిఫ్లవర్ వంటివి కూరగాయల జాతికి చెందినవిగా భావిస్తారు కానీ వీటిని కూడా ఆకుకూరలుగానే లెక్కిస్తారు. వీటిని తినడం ద్వారా కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే ప్రధానమైన ఆకుకూరలు అంటే గొంగూర, తోటకూర, బచ్చలి, గంగవాయి, పొన్నగంటి, పాలకూర, మెంతికూర.. ఇలాంటి వాటిని ఎక్కువగా వాడటం వలన శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయి.
మార్కెట్లో విరివిగా దొరికే తోటకూర ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కంటిచూపు మెరుగుపరిచే విషయంలో డాక్టర్లు ప్రధానంగా చెప్పే ఆహారం తోటకూరే. విటమిన్ ఎతో పాటు విటమిన్ కె, విటమిన్ సి, ప్రొటీన్లు, రైబోఫ్లోవిన్లు తోటకూరలో పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు కంటిచూపు మెరుగుపడుతుంది. తోటకూరలో ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు సైతం పుష్కలంగా ఉంటాయి. దీంతో రక్తశుద్ధికి ఉపకరించడమే కాక…రక్తహీనతతో బాధపడేవారికి మంచి మందులా పనిచేస్తుంది. అనీమియా ఉండే చిన్నపిల్లలకు, గర్భిణీలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారం తోటకూర.

గోంగూరు రుచి విషయంలో ఎలా ఫిదా చేస్తుందో.., ఆరోగ్యం విషయంలోనూ అంతే బాగా సహకరిస్తుంది. తోటకూరలో ఉన్నట్టే అన్ని మూలకాలు దీనిలోనూ ఉంటాయి. అవేకాక సి విటమిన్ కాస్త ఎక్కువ ఉండటం వలన నోటికి పులుపుగా తగులుతుంది. దీనిలో ఉండే ఇతర పోషకాలు వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాక.., క్యాన్సర్ల ముప్పును తగ్గించడం, ఎముకల్ని ధృడంగా ఉంచడం, గుండె, మూత్రపిండాల వ్యాధుల్ని నివారించడంలో బాగా ఉపకరిస్తుంది.

చాలా మందికి ఫేవరేట్ పాలకూర. దీనివలన కూడా అనేక లాభాలున్నాయి. కాపర్, జింక్, ఒమెగా 3 ఆమ్లాలు పాలకూరలో తగినంత ఉంటాయి. దీంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు పాలకూర మంచి పరిష్కారం చూపిస్తుంది. బచ్చలికూరలోనూ ఐరన్, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. గుడ్డు తినడం వలన కలిగే ప్రయోజనం బచ్చలికూర వలన కూడా కలుగుతుందంటారు.

ఆధునిక జీవనవిధానంలో రక్తపోటు, షుగర్ లాంటివి సాధారణ జబ్బులైపోయాయి. వీటిని అదుపులో ఉంచడానికి ఆకుకూరలు చక్కగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారికి మెంతికూర అద్భుతమైన ఔషధం. దీన్ని ముల్లంగితో కలిపి తినడం వలన మరిన్ని ప్రయోజనాలుంటాయంటారు. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. ముల్లంగి దుంపను కూరగా తింటుంటారు. అయితే ముల్లంగి ఆకును తక్కువమంది మాత్రమే కూరగా చేసుకుంటారు. కానీ ముల్లంగి ఆకును విరివిగా వంటల్లో వాడవచ్చు. దీనివలన శరీరంలో రోగనిరోధకశక్తి పెరిగి గాయాలు త్వరగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పొన్నగంటి కూర చాలా శక్తివంతమైనది. అధిక విటమిన్లు ఉండే పొన్నగంటికూరను తినడం వలన కడుపులో చేరిన వెంట్రుకలు వంటివి కూడా నాశనమవుతాయంటారు. చామదుంపల్నే కాక.. చామ ఆకుల్ని కూడా కూరగా వండుకోవచ్చు. మొలల వ్యాధిఉన్నవారికి చామాకు పరిష్కారం చూపిస్తుంది. ఇక శాకాహారులే కాకుండా మాంసాహారులు కూడా బాగా ఇష్టపడేది చింత చిగురు. దీని ప్రయోజనాలు ఇన్నీ అన్నీ చెప్పడం కష్టం. చింతచిగురులో ఉండే సి విటమిన్, ఇతర పోషకాల వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తశుద్ధి జరగడమే కాక కాలేయానికి శక్తినిస్తుంది. పైత్యం, వికారాలను తగ్గించి, లాలాజలగ్రంధిని ఉత్తేజపరచడంలో చింతాకు బాగా పనిచేస్తుంది. ఇక కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాంటి వాటిలో అత్యధిక పోషకాలుంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలుండటమే కాక క్యాన్సర్ల ముప్పును కూడా తగ్గించుకోవచ్చు.
దాదాపు అన్ని ఆకుకూరల్లోనూ పోషకాలు ఎక్కువే ఉంటాయి. అన్నింటిలోనూ పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చూస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, కంటిచూపు మెరుగుపరచడంలోనూ ఆకుకూరల పాత్ర చాలానే ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానూ, క్రొవ్వు తక్కువగానూ ఉంటుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశమూ తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా ఉంచడానికి, వెంట్రుకల రాలడం తగ్గడానికి.. ఇలా అనేక రకాలుగా ఆకుకూరలు ఉపయోగపడతాయి. వారంలో కనీసం మూడు రోజులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలర్జీలు, దురదలు, చర్మ వ్యాధులున్నప్పుడు వైద్యుల సూచన మేరకు గొంగూర లాంటి కొన్నింటిని దూరం పెట్టాల్సిరావచ్చు. ఆయా సందర్భాల్లో మినహా ఆకుకూరలు అందరూ తినదగ్గర ఆహారం.
కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆకుకూరలు ద్వారా అందే పోషకాలను పూర్తిస్థాయిలో పొందొచ్చు. ఆకుకూరలు వండుకునేటప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. పసుపు రంగులోకి మారిన ఆకుకూరల్ని తినడం వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పచ్చటి రంగులో ఉండే ఆకుకూరల్నే కొనుక్కోవాలి. అలాగే తాజాగా ఉండటం కూడా అవసరం. వారానికి సరిపడా కూరలు ఒకేసారి కొంటుంటారు. ఆకుకూరల్ని అలాగే కొనడం పొరపాటు. వీలైనంత తాజాగా ఆకుకూరలు వండుకోవాలి. అలాగే ఇతర సరుకులు, కూరలతో కలిపి కట్టగట్టి ఆకుకూరల్ని దాచకూడదు. వాటిని విడిగా భద్రపరుచుకోవాలి.
కొంతమంది తల్లులు ఆకుకూరలు వండిపెడితే పిల్లలకు విరేచనాలు అని భయపడుతుంటారు. ఇది అపోహే. ఆకుకూరల వలన ఎటువంటి రోగాలు రావు. అయితే ఆకుకూరల్ని పండించే క్రమంలో ఎరువులు కొట్టడమో, మొక్కకు పురుగు పట్టడమో, రవాణా చేసే సమయంలో దుమ్ము పట్టడమో జరుగుతుంది. దీని వలన సరిగ్గా శుభ్రం చేయకుండా వండితే క్రిములు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆకుకూరల్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకుని ఆ తరువాతే వండుకోవాలి.
ఆకుకూరలతో ఆరోగ్యానికి మంచిది. ఈ మాట ఎవరికి తెలియదు చెప్పండి. మన బంధువులు, స్నేహితులు అందరూ ఆకుకూరలు ఎక్కువగా తినాలనే చెబుతారు. అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకు వెళితే ఆయనా అదే సలహా ఇస్తారు. అయితే ఆ సలహాను పాటిస్తున్నది ఎంతమందంటే మాత్రం సమాధానం దొరకదు. ఆకుకూరలు తినండి అని వేరొకరికి మనమే సలహా ఇస్తాం. కానీ పాటించాల్సివస్తే మాత్రం అంతగా ఇష్టపడం. కాబట్టి అలవాటు మార్చుకోండి. ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవాలనే ఆలోచన మనసులో నాటుకుంటే మీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.