Healthiest Breakfast : బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటే మంచిది..!

By manavaradhi.com

Updated on:

Follow Us
What Are the Healthiest Breakfasts?

రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం చేస్తుంది. కాబట్టి మనకు అంత మేలు చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే మంచిది… అల్పాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,

రాత్రంతా నిద్రపోయి, ఉదయాన్నే లేచిన తర్వాత పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కాస్తంత అల్పాహారం తీసుకోవడం ద్వారా తగిన శక్తి లభిస్తుంది. అదే విధంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉదయం తీసుకొనే బ్రేక్‌ఫాస్ట్‌ ఎంతో అవసరం. బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. ఉదయాన్నే అల్పాహారం మానేయడం వల్ల నీరసించి పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి, ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. తిరిగి వేగవంతంగా పుంజుకుంటాయి.

ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి ?

ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఉదయం నుంచి సాయంత్ర వరకూ చేసే పనులకు శక్తినిచ్చేది అల్పాహారమే. మనం రెగ్యులర్‌గా రోజూ తీసుకొనే బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషకవిలువలున్న ఆహారాలను తీసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌లో సమతులాహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్ లు, అటుకులు, ఓట్ మీల్ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు. పీచు తర్వాత మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటికోసం రోజూ గుడ్లను అల్పాహారంతో పాటు తీసుకోవడం వల్ల అవసరమైన ప్రొటీన్ అందుతుంది.

మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా చేర్చుకోవచ్చు. అలాగే అల్పాహారంగా తృణ ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకునే వారు ఆరోగ్యంగా ఉండవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకుంటే.. రోజంత తక్కువ ఆహారం తీసుకోవడానికి, బరువుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మెటబాలిజం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తీసుకోవడం వల్ల.. మలబద్దకము తగ్గుతుంది. మన శరీరానికి కావలిసిన పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి.

ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించటం ఒక ఎత్తైతే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలన్నది ముఖ్యమైన అంశం. రోజు మెుత్తం మీద పండ్లు , కూరగాయలు కనీసం మూడు దఫాలుగా, మూడు మెుత్తాలుగా తీసుకోవాలన్నది సూత్రం. కాబట్టి ఉదయం అల్పాహారంలో కూడా ఇవి ఉండేలా చూసుకోవాలి. ఏ పదార్థం తయారు చేసుకున్నా అందులో కూర ముక్కలు, కూరగాయల తరుము వంటివి ఉండేలా చూసుకోవచ్చు. ఏదో ఒక రకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకునే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది.

నూనెతో చేసే పూరీల కంటే ఉదయాన్నే నూనె పెద్దగా లేని చపాతీల వంటివి , వాటిల్లోనూ ఆకుకూరలు వంటివి కలుపుకొని వండుకోవటం మంచిది.శద్ది చేసిన గోధుమలతో తయారయ్యే తెల్ల బ్రెడ్డు ముక్కల కంటే ముడి గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్ తినటం మంచిది, దాన్ని కూడా మాంసకృత్తులు ఎక్కువడా ఉండే గుడ్డు వంటివాటితో తీసుకోవడం మంచిది. టిఫిన్ అనగానే చాలామంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేస్తే పోలా అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లోనే తినడం మంచిది. తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్, బాదం… అక్రోట్ వంటి వాటిని తినొచ్చు.

బ్రేక్‌ ఫాస్ట్‌ తినకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అల్పాహారం తీసుకోవడం మాత్రమే కాదు… సరైన విధంగా దీన్ని ఎంచుకోవడం చాలా కీలకం. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రొటీన్ సహా… పలు రకాల ఆహారాలను తీసుకోవచ్చు.

Leave a Comment