తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీలో ఓటమి భయం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండోసారి అధికారాన్ని చేజార్చుకోకూడదనే ఆలోచనతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీదపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 మంది ఎమ్మెల్యేల్లో 50 మందికి టికెట్ ఇచ్చేదే లేదు అని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వినిపిస్తున్న వార్త. దాని ఫలితమే నేతల రాజీనామాలు అన్నట్లుగా మరోవైపు చర్చ నడుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపి రాజకీయాలపై ప్రభావాన్ని చూపెడుతున్నాయి. కెసీఆర్ తాను ఇచ్చిన ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు తమను ఎన్నికల్లోప్రజలు మళ్లీ మమ్మల్నే గెలిపిస్తారన్న ధీమా ఒక్కసారిగా పటాపంచలు అయింది. ఏపిలో కూడా ఇదే దోరణితో ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలంగాణ ఫలితాలతో తన మైండ్ సెట్ ను మార్చుకున్నారు. అసలే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పీకల్లోతు వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో భారీ మార్పులతో గట్టు ఎక్కాలని జగన్ భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వైసీపీ (YCP) ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగా కనిపిస్తుంది. అటు తెలంగాణాలోను తమకు అనుకూలంగా ఉండే బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్(Congress)ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్తవారిని నిలబెట్టాలని వైసీపీ చూస్తోంది. ఇందులో భాగంగానే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారగా..మిగిలిన 150మందిలో 50మంది సిట్టింగులకు ఈసారి టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న 42మంది ఎమ్మెల్యేలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా సీటు మార్చాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishnareddy), గాజువాక ఇన్చార్జ్ దేవన్ రెడ్డి(Devan Reddy) తమ పదవులకు రాజీనామా చేశారు. వీళ్లే కాదు..ఈసారి జగన్ టికెట్ ఇవ్వని వారి జాబితాలో మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. మరి కొద్దిరోజుల్లో వైసీపీ నుంచి భారీ ఎత్తున రాజీనామాలు మార్పులు చెరుప్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.