ఆశ్వయుజ శుద్ధ సప్తమి, శనివారము, తేది. 21.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు.
ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ ।
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీలలితా త్రిపురసుందరీ దేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి, ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణిగా చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీఅమ్మవారు త్రిపురసుందరీ దేవిగా పూజలందు కుంటున్నారు.
ఈరోజు అమ్మవారు బంగారు రంగుచీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే మంచిది. అమ్మవారికి నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెట్టాలి. సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.