వన్డే వరల్డ్ కప్ టోర్నీ.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు అసలైన పెద్ద పండగ నేటి నుంచి మొదలవబోతోంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. వన్డే క్రికెట్ మహా సంగ్రామానికి నేడు తెరలేవనుంది. ప్రపంచకప్ ను ఒడిసిపట్టాలని ఏళ్ల తరబడి ప్రణాళికలు రచించిన జట్లు వాటిని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. గత ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ -న్యూజిలాండ్ (ODI WC 2023) మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే పోరుతో ఈ మహా సంరంభం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సన్నిహితులకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశం పెట్టాడు. వరల్డ్ కప్ సందర్భంగా తనను టికెట్ల కోసం ఒత్తిడి చేయొద్దని కోరాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. క్రికెటర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆ జాబితాలో ఉండటం సహజం. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని విరాట్ ఇలాంటి స్టోరీ పెట్టడం గమనార్హం.
విరాట్ ఏమని స్టోరీ పెట్టాడంటే మేమంతా వరల్డ్ కప్‌కు సాధనలో బిజీగా ఉన్నాం. ఇలాంటి సమయంలో స్నేహితులకు మనస్ఫూర్తిగా ఓ విన్నపం చేస్తున్నా. ఎవరైనా సరే టోర్నీ ఆసాంతం టికెట్ల గురించి మమ్మల్ని అడగొద్దు. టికెట్లు అందుబాటులో లేకపోతే హాయిగా ఇంట్లోనే మ్యాచ్‌లను ఆస్వాదించండి ప్లీజ్ అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక అభిమానుల కోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొన్ని టికెట్లను నేరుగా విక్రయించాలని నిర్ణయించింది.
46 రోజుల పాటు సాగనున్న వన్డే ప్రపంచకప్ పోరు నవంబర్ 19న జరిగే ఫైనల్ తో ముగియనుంది. ఈ క్రమంలో 48 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. భారత్ తొలి సారిగా పూర్తి స్థాయిలో వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ చేరిన భారత్ జట్టు ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత టోర్నీ ఫార్మాట్ తరహాలోనే బరిలో పది జట్లు నిలిచాయి. ప్రతీ టీమ్ ఇతర తొమ్మిది జట్లతో తలపడుతుంది. వరల్డ్ కప్ తొలి రెండు టోర్నీల్లో జగజ్జేతగా నిలిచి సుదీర్ఘ కాలం క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే వావడం విశేషం.