Gap Between Teeth : దంతాల మధ్య ఖాళీలు ఎందుకొస్తాయ్‌..?

By manavaradhi.com

Published on:

Follow Us
Causes and Treatment Options for Gap Teeth

ముఖానికి చిరునవ్వే అసలైన అందం..! ఆ నవ్వులో ఎన్నెన్నో భావాలు.. ఎంతో సోయగం. నవ్వుతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలు వరస పలకరిస్తుంది. అన్నీ కలిసి… ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది. అందుకే చిరునవ్వుకూ, ఆత్మవిశ్వాసానికీ, పలువరుసకూ, అందానికీ.. అంతటి విడదీయరాని బంధం! అలాంటి పలువరసకు అవరోధాలు ఏర్పడితే… ఊడిన పళ్ల స్థానాన్ని బ్రిడ్జెస్ ద్వారా పూర్తిచేయడం ఎలాగో తెలుసా..?

చిన్న వయసు పాల పళ్లు 20 ఉంటాయి. శాశ్వత దంతాలు 32 ఉంటాయి. దంతాలతో ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. మాట్లాడతాం కూడా. దంతాలు వజ్రాలంత దృఢమైనవి. అందుకే అవి ఆయుధాలుగా కూడా ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం అయ్యేది ముందుగా నోట్లోనే. ఆహారాన్ని బాగా నమిలితేనే బాగా జీర్ణం అవుతుంది. ఇలా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మాట్లాడడానికి, అందమైన నవ్వు కోసం, రక్షణ కోసం ఆయుధంగానూ దంతాల పాత్ర కీలకం. దంతాలు… ముందుపళ్లు, కోరపళ్లు, రెండు మొనల దంతాలు, దవుడ పళ్ళు…. ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి. రెండు దవుడలకూ క్రిందాపైనా ఉండే నాలుగేసి పళ్లను ‘ముందుపళ్లు’ అంటారు. ఇవి పదునుగా ఉంటాయి. ఆహారాన్ని కొరకడానికి, పట్టి ఉంచడానికీ ఉపయోగపడతాయి. ముందుపళ్ళకు ఇరు ప్రక్కల ఉండే పళ్ళను కోర పళ్ళు అంటారు. ఇవి ఆహారాన్ని చీల్చడానికి సహాయపడతాయి. కోరపళ్లకు రెండు ప్రక్కలా ఉండే పళ్లను రెండు మొనల దంతాలు అంటారు. వీటి ప్రక్కన రెండు దవడలలోనూ కలిపి 12 దంతాలుంటాయి. ఇవే ‘దవడ పళ్ళు’. దంతాలన్నింటిలో 2 భాగాలుంటాయి. చిగురుకు పైన ఉండే భాగం శిఖరం… చిగురు లోపల ఉండేది మూలము.

వరుసగా ఒకటి కన్నా ఎక్కువ పళ్లు విరిగిపోతే ఆ ఖాళీని.. ‘బ్రిడ్జెస్‌’ ద్వారా పూరిస్తారు. అటుపక్క, ఇటుపక్క ఉండే దంతాల ఆధారంగా వాటిని అంటిపెట్టుకుని ఉండేలా వీటిని రూపొందిస్తారు. కట్టుడు పళ్ళని బ్రిడ్జెస్ ద్వారా పెడుతుంటారు. ఈ పద్ధతిలో ఒక పన్ను వూడిపోతే దానికి అటు, ఇటు ఉన్న పళ్ళని పైన చెక్కి వాటిమీద క్లిప్పులా కృత్రిమ పళ్ళు దిగేలా చేసి మధ్యలో ఉన్న ఖాళీలో పన్ను అమరేలా చేస్తారు. ఇలా శాశ్వతంగా పళ్ళు బిగుసుకుని ఉండేలా అమర్చడం మధ్యలో రెండు, మూడు పళ్ళు లేకపోతే చేస్తారు. ఒక్కోసారి ఒకే పన్ను పోవచ్చు. అప్పుడు అటు, ఇటు ఉన్న పళ్ళని చెక్కకుండా మధ్యలో కృత్రిమ పన్నుని.. మెటల్ క్లాస్ప్స్ సహాయంతో పళ్ళని పట్టుకునేట్లు చేసి కృత్రిమ దంతాన్ని భిగిస్తారు. ఎక్కువ పళ్ళు పోయినపక్షంలో ఒక్కోసారి దవడలోని పళ్ళన్నీ కూడా ఒకే కృత్రిమ పంటి సెట్‌తో భిగించవచ్చు. కట్టుడు పళ్ల మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించటానికి వీలుండదు. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది. వీటివల్ల మాట కూడా సరి అవుతుంది. నోటి శుభ్రతను పాటిస్తే ఇవి చాలాకాలం బాగుంటాయి.

నోటిలో గట్టిగా ఉన్న సహజ శాశ్వత దంతాల ఆధారంగా ఖాళీలను కృత్రిమ డెంటల్ బ్రిడ్జెస్ పూరించడం వంటి చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. రెండు పళ్ళు ప్రక్కపళ్ళు అంటే.. కుడి పక్క ఒకటి, ఎడమ పక్క ఒకటి గట్టిగా ఉన్న పళ్ళను రెండు-మూడు మిల్లీ మీటర్ల పరిమాణం మేర సైజులో చిన్నవిగా చేసి వాటిని ఆధారంగా చేసుకొని తొడుగుల రూపంలో తయారుచేస్తారు. ఆ రెండు తొడుగులను కలుపుతూ లోపించిన రెండు పళ్ళను కూడా కలిపి మొత్తం నాలుగు పళ్ళకు తయారుచేస్తారు. ఈ పళ్ళు మెటల్ సిరామిక్ అయితే… మెటల్ మరియు సిరామిక్ మెటీరియల్‌తో తయారుచేస్తారు. ప్రత్యేకంగా పింగాణితో గానీ లేక జిర్కోనియంతో గానీ తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన దంతాలు… ఒరిజినల్ పక్కపళ్ళు ఏ రంగులో ఉన్నాయో అదే రంగులో ఉండి, అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా తయారుచేసిన బ్రిడ్జి నాలుగు పళ్ళు… ఇరువైపుల ఉన్న తొడుగులలో డెంటల్ సిమెంట్‌ను నింపి ఆ బ్రిడ్జిని అరగదీసిన పళ్ళకు అతికించినట్లయితే ఆ ఆకృతికి పళ్ళు శాశ్వతంగా కదలకుండా అతుక్కుపోతాయి. ఒరిజినల్ పళ్ళ మాదిరిగానే బలంగా ఉండి, మిగతా పళ్ళతో కలిసిపోతాయి.

బ్రిడ్జ్‌ తయారుచేసిన మెటీరియల్‌ను బట్టి వాటి నాణ్యత ఉంటుంది. కృత్రిమ పళ్ళైనా.. సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉంటాయి. దానిలో కోల్పోయిన పళ్ళను మరలా పొందిన పళ్ళతో మనస్సుకు తృప్తి, ఆనందం, సంతోషాన్ని పొందడం జరుగుతుంది. అంతేకాకుండా కొరకటానికి, నమలడానికి కూడా ఎంతో అనువుగా ఉండి ఆహారాన్ని నమిలి తినడానికి వీలు కలుగుతుంది. హాయిగా నవ్వుకోవడానికి, మాట్లాడటానికి ఎంతో నిబ్బరంగా ఉండి దైనందిన కార్యక్రమాలను ఎంతో నైపుణ్యంగా నిర్వహించగలుగుతారు. ఊడిపోతాయని భయపడవలసిన అవసరం లేదు. గట్టిపదార్థాలను కొరికినప్పుడు కాస్తంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బ్రష్ చేసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. ప్రతి ఆరునెలలకొకసారి దంత వైద్యుడిచే పరీక్ష చేయించుకోవాలి. మెరుగైన వాతావరణం మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందనే వాస్తవాన్నిప్రతి ఒక్కరూ గ్రహించాలి. గాలి, వెలుతురు సమృద్ధింగా ఉండే పర్యావరణాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి.

Leave a Comment