పడుకున్న వెంటనే క్షణాల్లో నిద్రపోయే అదృష్టవంతులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మనలో చాలా మంది ఆర్థరాత్రిదాకా ఎడతెగని ఆలోచనలతో నిద్రపట్టక గిలగిల తన్నుకొంటుంటారు. మంచి నిద్ర రావాలంటే ఏంచేయాలి..? పడకగదిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించుకోవడం ద్వారా కంటినిద్ర పొందవచ్చు..?
కమ్మగా నిద్రపోవాలని.. అందమైన కలలు కనాలని అందరూ ఆశ పడుతుంటారు. అయితే చక్కటి నిద్ర కొందరికే సాధ్యం. రోజువారి హడావుడి, ఒత్తిడుల మధ్య నిద్రకు దూరమై జబ్బులు కొనితెచ్చుకోవటం ఇప్పుడు సాధారణమైపోయింది. పక్కచూడగానే పడి నిద్రపోయే రోజులు పోయి మెత్తటి పక్కమీద కూడా నిద్రరాక దొర్లేవాళ్లు పెరిగిపోతున్నారు. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది చాలా మందిలో అందని ద్రాక్షే అవుతోంది.
రాత్రి నిద్ర సరిగా లేకపోతే అనారోగ్య జీవన విధానాలు ఆరోగ్యాన్ని పాడుచేసి రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయాలన్నా ఇంట్రస్ట్ ఉండదు. మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం, పడకగదిలో ప్రశాతంత మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. ఆరోగ్యమైన నిద్ర పొందాలంటే…వేళకు పడుకోవటం – వేళకు లేవడమనేది చాలా ముఖ్యం. లేకపోతే క్రమంగా బ్రెయిన్ పనితీరు మందగిస్తుందని రుజువైంది. అనారోగ్యాలు, డిప్రెషన్లు, ఊబకాయాలు ఖాయమని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
మంచినిద్ర పొందాలంటే ముందుగా మన శరీరానికి నప్పేలా పరుపును సెలక్ట్ చేసుకోవాలి. శరీరం బరువును తట్టుకొనేలా పరుపులో కుషన్స్, స్ప్రింగులు ఉండేలా చూసుకోవాలి. ఫోమ్‌తో తయారుచేసే పరుపులు అయితే మరీ మంచిది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న గాలినింపే పరుపులు కూడా మంచి నిద్రను ఇస్తాయి. పరుపులపై వేసే బెడ్‌షీట్స్ శుభ్రమైనవి, తక్కువ రంగుల్లో ఉండేవి ఎన్నుకోవాలి. వారానికి ఓసారైనా బెడ్‌షీట్స్ ఉతకాలి. తలగడలు కూడా మన బరువుకు సరిపడేలా, మెత్తగా ఉండేలా చూసుకోవాలి.
పడకగదిలో తగిన ప్రశాంత వాతావరణం ఉండేలా గోడలకు రంగులు అద్దడం, ఫ్యాన్లు, ఏసీలు ఎలాంటి శబ్దం చేయకుండా పనిచేసేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నడుంను ఒకవైపునకు వంచి పడుకునేవారు తలగడలు మెత్‌నగా ఉండేవి ఎంచుకోవాలి. నిటారుగా పడుకొనేవారు, నడుంనొప్పితో బాధపడేవారు కాళ్లకింద తలగడలు పెట్టుకోవడం ఉత్తమం. గర్భంతో ఉన్నవారు మెత్తని పరుపును వినియోగించడమే కాకుండా ఎడమవైపు తిరిగి పడుకోవడం అలవర్చుకోవాలి. కాళ్ల మధ్య తలగడ పెట్టుకొంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు డిన్నర్ లో తీసుకోండి. మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట తినకూడదు. పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, చాటింగ్ చేయడం లాంటివి మంచివి కాదు. పడుకునేముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గదిలో వెలుగును తగ్గించి కళ్ళకు స్వల్ప ఒత్తిడి కలిగిస్తే కొద్ది నిమిషాలలో నిద్ర వస్తుంది.
నరాల వ్యవస్ధను ఉత్తేజం చేసే కాఫీ, టీ వంటివి తాగరాదు. కెఫీన్ నిద్రాభంగం కలిగిస్తుంది. నిద్రించే ముందు కొద్దిసేపు యోగా, ధ్యానం లేదా తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల కండరాలను విశ్రమింపజేసి శరీరాన్ని, మైండ్ ను నిద్రించేటందుకు అనువుగా తయారుచేస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అతినిద్ర ఎంత హాని తలపెడుతుందో.. మంచి నిద్ర ఎంతో మేలు చేస్తుందని తెల్సుకోవాలి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. సో హాయిగా నిద్రపోండి.. ఆరోగ్యంగా ఉండండి.