Prostate problems : ప్రొస్టేట్‌ సమస్యలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

By manavaradhi.com

Published on:

Follow Us
Prostate problems

వయసు పైబడుతున్న కొద్దీ పురుషుల్లో ప్రధానంగా కన్పించేవి ప్రొస్టేట్‌ సమస్యలే. ప్రొస్టేట్‌ గ్రంథి పరిమాణం పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన అనారోగ్యంగా మారుతుంది. కొన్నిసార్లు ఇది ప్రొస్టేట్‌ గ్రంధి వాపుకు కూడా దారితీసే అవకాశం ఉంది. అయితే తొలిదశలోనే ఈ సమస్యని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే పూర్తి స్థాయిలో దీనిని నివారించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రొస్టేట్‌ అనేది చిన్న చిక్కుడు గింజ పరిమాణంలో ఉండే గ్రంథి, ఇది పురుషుల్లో మూత్రసంచికి దిగువ ఉంటుంది. మూత్రనాళంతో ఆవరించి ఉంటుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. 50 సంవత్సరాల వయస్సు తరువాత ప్రొస్టేట్‌ సమస్యలు ఎంతో సర్వసాధారణం. పురుష హార్మోన్‌ చర్య వల్ల ప్రొస్టేట్‌ చాలా మందిలో విస్తరిస్తుంది.

ప్రొస్టేట్‌ గ్రంథి పెద్దదౌతున్న క్రమంలో మూత్రసంచిపై భారం పడుతుంది. దీనివల్ల మూత్ర ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. ప్రొస్టేట్‌ వృద్ధి వల్ల, మూత్రనాళం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరగడం వల్ల రోగ లక్షణాలు ఆలస్యంగా బయట పడుతాయి. దీని కారణంగా ఎన్నోసమస్యలు వస్తాయి.

మొట్టమొదటగా మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగి, అవి దెబ్బతింటాయి. డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. మరి కొందరిలో ఇది క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉంది. మరి కొందరిలో మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోయినప్పుడు అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులు దీని కారణంగా తరుచూ మూత్రంలో ఇన్ఫెక్షన్‌, మంట, హృద్రోగులకు ప్రొస్టేట్‌ సమస్య వల్ల మూత్రంలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది.

ప్రొస్టేట్‌ పెరుగుదల అందరిలోనూ ఒకేలా ఉండదు. కొంతమందిలో చాలాకాలం వరకూ ఎటువంటి సమస్యా కన్పించకపోవచ్చు. ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుతున్న తీరును బట్టి సమస్య తీవ్రత ఉంటుంది. మరి కొంతమందిలో ప్రొస్టేట్‌ గ్రంథి మూత్రనాళం వైపు కాకుండా బయటివైపు పెరుగుతుంది. అలాంటి వారికి సమస్య అసలు ఉండకపోవచ్చు. మూత్రంలో మంటగా అనిపించడం,మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం, మూత్రం చుక్కలు చుక్కలుగా రావడం, రాత్రి వేళ తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల నిద్రాభంగం కలగడం. ప్రొస్టేట్‌ బ్లాడర్‌లో పెరిగినపుడు మూత్రం పూర్తిగా విసర్జన కాకపోవడం వల్ల బ్లాడర్‌లో మిగిలిపోతుంది. దీనివలన ఇన్ఫెక్షన్‌తో మూత్రపిండాలు చెడిపోతాయి.

అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష ద్వారా ప్రొస్టేట్‌ గ్రంథి పరిమాణం బ్లాడర్‌ మీద దాని ప్రభావం, మూత్ర పిండాల పనితీరుని అది ఎంతవరకూ ప్రభావితం చేస్తోందో తెలుసుకుని సమస్యని గుర్తిస్తారు. నలభై నుంచి యాభై ఏళ్లపైబడిన వాళ్లు ప్రతి సంవత్సరం సెరమ్‌ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజైన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, మూత్ర సంబంధిత ఇబ్బందులుంటే కూడా చేయించుకోవాలి.

ప్రొస్టేట్‌ సమస్యలున్నవారు ద్రవపదార్థాలు తీసుకొనేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు పూర్తిగా అవసరమైన పానీయాలను ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. బాత్రూమ్‌కి వెళ్లకుండా ఆపుకోవడం ఎప్పుడూ పనికిరాదు. బాత్రూమ్‌ వెళ్ళాల్సిన అవసరం కలిగిన వెంటనే వీలైనంత త్వరగా వెళ్ళాలి. ఒకసారి యూరిన్‌కి వెళ్ళి వచ్చిన తరువాత మరొకసారి వెళ్ళి బ్లాడర్‌ ఖాళీ అవుతుందేమో ప్రయత్నించాలి. అయితే బలవంతంగా మాత్రం మూత్ర విసర్జన చేసే ప్రయత్నం చేయకూడదు.

సరిగ్గా సీటు సౌకర్యంగా లేని బైక్‌లుగానీ, కార్లుగానీ నడపకూడదు. దీనివల్ల ప్రొస్టేట్‌పై మరింత ఒత్తిడి పడి గాయపడుతుంది. యాంటి డిప్రెసెంట్లు, డైయురెటిక్స్‌ లాంటి మందులను వాడకూడదు. సాధారణ జలుబుకు వాడే మందులకు కూడా దూరంగా ఉండాలి. ఈ మందులు ప్రొస్టేట్‌ సమస్యలను మరింత జటిలం చేస్తాయి. ప్రొస్టేట్‌ గ్రంథి చికిత్సలో ఎనభై శాతం మందికి మందులతోనే నయమవుతుంది. కాబట్టి ప్రొస్టేట్‌ సమస్యలను అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

ప్రోస్టేట్ సమస్య 40 సంవత్సరాలు పైబడినవారిలో ఎక్కువగా కనబడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెద్దది కావడంవల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకోవాల్సి వుంటుంది.

Leave a Comment