Exercise and Asthma : ఆస్తమా ఉన్నవారు ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు వీటిని పాటించకపోతే కష్టమే..

By manavaradhi.com

Updated on:

Follow Us
Exercise and Asthma

దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యల్లో ఆస్తమా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రోజురోజుకీ ఆస్తమా రోగుల సంఖ్య పెరుగుతోంది. వాయు గొట్టాలు ఉబ్బడం, అస్తవ్యస్తపు ఆహారపు అలవాట్లు, దుమ్ము, ధూళి, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం లాంటివి దీనికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య ఏ వయసువారికైనా రావచ్చు. మరి ఈ ఆస్తమా సమస్య ఉన్నవారు కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నిజానికి వ్యాయామం వల్ల ఆస్తమా అటాక్స్‌ తగ్గుతాయి. దానివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కేలరీలు వినియోగమై బరువు తగ్గుతారు. బరువు తగ్గేకొద్దీ ఆస్తమా రిస్కు తగ్గుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల మంచి ఆక్సిజన్‌ అంది అవయవాలన్నీ శక్తిమంతమవుతాయి. అలర్జీలనే కాదు, ఇన్‌ఫెక్షన్లను కూడా తట్టుకోగలుగుతారు. అయితే ఆస్తమా వచ్చిన వారికి ఈ పరిస్థితి ఉండదు. వారూ రోజూ నడవడంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం రావచ్చు. అందుకే ఇలాంటి వారు వ్యాయామం అంటే కాస్త దూరంగా ఉంటారు.

ఆస్తమా వచ్చిన వెంటనే ఊపిరి తిత్తుల సమస్య ఉపశమనం కోసం వైద్యులను సంప్రదించాలి. ఊపిరి తీసుకోవడంలో సమస్య లేకుండా నిర్థారించుకున్న తర్వాతే చిన్న పాటి వ్యామాలు చేయవచ్చు. నిజానికి ఆస్తమా లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది హుషారుగానే ఉంటారు. రోజువారీ పనులు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. ఇలాంటి వారు వైద్యుని సంప్రదించి, వారి ఆస్తమా స్థాయి ఎంత మేరకు ఉందనే విషయాన్న తెలుసుకుని ఓ నిర్థారణకు రావాలి. ఆస్తమా ఉన్న వారు వ్యాయామం చేయాలనుకుంటే వారి పని తీరులో చిన్నపాటి మార్పులతో నిరభ్యంతరంగా చేయవచ్చు.

ఆస్తమా ఉన్నవారు పూర్తిగా వ్యాయామానికి దూరం కావడం కూడా మంచిది కాదు. అందుకే ఆస్తమా విషయంలో నిపుణుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. వ్యాయామానికి ముందు చేయవలసి కార్యాచరణ ప్రణాళిక గురించి వైద్యులు వివరిస్తారు. ఎక్కువ ఆస్తమా ఉన్నట్లయితే వ్యాయామం ప్రారంభించడానికి ముందు కచ్చితంగా ఆస్తమా ఇన్హేలర్ ను తీసుకోవాలి. దీన్ని వ్యాయామం చేసినంత సేపూ దగ్గరనే ఉంచుకోవడం మంచిది. మధ్యలో ఏ మాత్రం సమస్య ఎదురైనా వెంటనే ఇబ్బంది లేకుండా పరిష్కారాన్ని పొందవచ్చు. ఇన్హేలర్ పీల్చుకున్న తర్వాత వ్యాయామం ప్రారంభించాలి. ముందుగా వార్మప్ వ్యాయామం చేయాలి.

వ్యాయామం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.. ఊపిరి విషయంలో అధిక సమస్యలు తెచ్చే వ్యాయామాల జోలికి పోకుండా, విశ్రాంతి తీసుకుంటే మేలు. ఆస్తమా ఉన్నవారు నిరభ్యంతరంగా స్విమ్మింగ్ చేయడానికి నూటికి నూరు పాళ్ళు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది సాధారణంగా వేడిగా, తేమగా ఉండే గాలిని పీల్చుతుంటారు. దీని వల్ల ఊపిరికి ఇబ్బంది ఉండదు. దానితో పాటు శరీరం దృఢంగా తయారు కావడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇండోర్ మరియు అవుట్ డోర్ బైకింగ్, ఏరోబిక్స్, వాకింగ్, ట్రెడ్ మిల్ మీద నడవడం కూడా ఆస్తమా ఉన్న వారికి ప్రయోజనం చేకూర్చి, సమస్యలు తీసుకురాని వ్యాయామాలు గా చెప్పుకోవచ్చు.

వామప్ వ్యాయామాలతో నిదానంగా వ్యాయామాన్ని మొదలు పెట్టాలి. వాతావరణం మరింత చల్లగా ఉంటే, ముక్కుకు అడ్డంగా చిన్న కండువాను ధరించాలి. ఆస్తమా ఉన్న వారు ఎక్కువ గాలిలో పుప్పొడి ఉండే ప్రదేశాల్లో అదే విధంగా ఎక్కువ వాయు కాలుష్యం ఉండే ప్రదేశాల్లో వ్యాయామం చేయకూడదు. చిన్న పాటి వైరల్ సమస్యలు ఉన్నప్పుడు వ్యాయామం తక్కువ చేయాలి. వ్యాయామం చేసే ప్రదేశం కూడా కచ్చితంగా మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. ఆస్తమా ఉన్న వారు పూర్తిగా వ్యాయామం మానేసి, సమస్య విషయంలో భయపడుతూ ఉండడం అస్సలు మంచిది కాదు.

ఆస్తమా తగ్గేందుకు సరైన చికిత్స తీసుకుంటూనే శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని చురుగ్గా జీవనశైలిలో నిర్వహించేందుకు వ్యాయామం చేయడం అవసరం. అయితే ఆస్తమా విషయంలో రోగ నిర్థారణ చాలా ముఖ్యం. దానికి తగ్గట్టు సరైన చికిత్స తీసుకోవడం కూడా అవసరమే. అంతే కాదు… వైద్యుల సలహాలు సూచనలు లేకుండా వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ, వారి సలహా మేరకు ఏ వ్యాయామం మంచిది అనే విషయాన్ని తెలుసుకుని, ఆస్తమాకు సంబంధించిన మందులను దగ్గర ఉంచుకుని, వ్యాయామం ప్రారంభించాలి. ఒక వేళ వ్యాయామం మధ్యలో ఈ సమస్య ఎదురైతే, వెంట ఉన్న ఇన్హేలర్ వాడడం, వైద్యుని సంప్రదించడం చేయాలి. సమస్య ఉంటే వైద్యులు వ్యాయామం విషయంలో మార్పులు సూచించడానికి ఆస్కారం ఉంది. వాటిని పాటించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.

Leave a Comment