శరీరానికి వాకిళ్లు మన కళ్లు.. శరీరంలోని అన్ని అవయవాల కన్నా అతి సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనట్టయితే ఇన్ఫేక్షన్లు సోకడం, మసకబారిపోవడం, రంగులు గుర్తించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కండ్లను జాగ్రత్ుగా కాపాడుకోవాలంటే ఏంచేయాలి..?
ప్రతి రోజు పనులు చేసుకోవటానికి కంటి చూపు చాలా ప్రధానమైనది. అంధకారమైన జీవితాన్ని ఊహించడానికి కూడా సాహసించలేం. కళ్ళు ఆత్మకు అద్దం పడతాయి. ఆనందాన్ని , ఆవేదనని వ్యక్తం చేస్తాయి . సంతోషాన్నీ , సంతాపాన్ని వెల్లడిస్తాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం.
మన వయసు 40 కి చేరగానే యేటా కంటివైద్యుడ్ని సంప్రదించి సాధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కొందరిలో కొన్ని సమస్యలు పైకి కనిపించవు. అయితే, కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెగ్యులర్‌గా కంటివైద్యుడ్ని సంప్రదించగానే కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్ చేస్తారు. కంటి సమస్యలు ఈ పరీక్ష ద్వారా బయటపడతాయి. గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ఏఎండీ సమస్యలు తెలుస్తాయి. కుటుంబంలో ఎవరైనా కంటి వ్యాధులతో బాధపడుతుంటే అవి వారసత్వంగా మీకూ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
కం్ట్లో ఎలాంటి అలర్జీ ఉన్నా.. ఇన్‌ఫెక్షన్ వచ్చినా త్వరగా బయటపడుతుంది. కన్ను ఎర్‌టగా మారడం, కంటి నుంచి నీరుకాడం వంటివి అలర్జీని గుర్తుచేస్తాయి. కంటికి గాయాలు ఐనప్పుడు తప్పనిసరిగా కంటి వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చూడటంలో ఇబ్బంది, కన్ను పూర్తిగా తెరువలేకపోవడం, తెల్లగుడ్డుపై రక్తం రావడం, ఒకటిగానీ, రెండుకళ్లు గానీ తిప్పలేకపోవడం, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సైజులో కంటిపాప ఉండటం వంటివి గమనించగానే వెంటనే వైద్యచికిత్స తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆల్ట్రావాయిలెట్ చలువ కళ్లద్దాలను వాడాలి.
కళ్లను అదేపనిగా రుద్దడం చేయకూడదు. దీనివల్ల కంటిలోని సూక్ష్మరక్తనాళాలు చితికిపోతాయి. అలాగే చేతికి వున్న సూక్ష్మక్రిములు కంట్లోకి చేరుతాయి. కంప్యూటర్ పై అదేపనిగా గంటల తరబడి పనిచేయకూడదు. అలా చేయాల్సివస్తే ప్రతి గంటకు ఓ రెండు నిమిషాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. కాంట్రాక్ట్ లెన్స్ వాడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం వాటిని శుభ్రపరుచుకోవాలి. స్నానం చేసే ముందు కాంటాక్ట్ లెన్స్ తీసేయాలి.
పొడి కళ్ళు అనేవి ఎక్కువగా కంప్యూటర్ వాడకం లేదా చాలా ఎక్కువగా బయట గాలి నుండి సంభవించవచ్చు. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం ఉంటే, ఒక వైద్యుడుని సంప్రదించాలి. కండ్లకలక సామాన్యంగా పుప్పొడి మరియు దుమ్ము వలన కలుగుతుంది. కార్నియా గీతలు, ధూళి లేదా కళ్లద్దాలు వలన కంటి రాపిడి సంభవించవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగటం, ధూమపానం చేయడం, అధిక రక్తపోటు, అధిక బ్లడ్ షుగర్ వంటి కారణాల వలన కంటి శుక్లాలు కలుగుతాయి. ఊబకాయం వంటి సమస్యలతో మధుమేహం ముప్పు ఎక్కువయి గ్లకోమాకు దారితీస్తుంది. నాణ్యతలేని మేకప్ సామాగ్రికారణంగా కూడా కంటి సమస్యలు వస్తాయి. స్విమ్మింగ్ చేసేప్పుడు తప్పనిసరిగా కళ్లద్దాలు వాడాలి.