ఆరోగ్యమైన జీవనం కోసం పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మొత్తం అందంలో పాదాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. శరీరంలో బయటకు కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. అందుకే పాదాల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. పాదాలు చూడటానికి నల్ల, అశుభ్రంగా ఉన్నప్పుడు చూడటానికి అసౌకర్యంగా ఉంటాయి.అంతే కాదు అలాంటి పాదాలు కొన్ని అనారోగ్య లక్షణాలను కూడా చూపుతాయి. రోజువారీ పనులతో బిజీగా ఉండుట వలన పాదాలపై పెద్దగా శ్రద్ద పెట్టరు. కొన్ని సహజ పద్ధతుల ద్వారా పాదాలను సంరక్షించుకోవచ్చు.
పాదాలు మన శరీర బరువును మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. మనం నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. చూసీ చూడనట్టు వదిలేస్తుంటాం. బిగుతుగా ఉన్నా చెప్పులు, షూ ధరిస్తుంటాం. ఇలాంటివన్నీ పాదాలపై తీవ్రమైన ఒత్తిడి కలగజేస్తాయి. ఏళ్లకేళ్లుగా శ్రమిస్తుండటం వల్ల పాదాలకు రక్త సరఫరా తగ్గటం వంటి జబ్బులూ దాడిచేయొచ్చు. అందువల్ల పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరం.
నడుస్తున్నా లేదా పని చేస్తున్నా కాళ్లకు కూడా చెమటలు పడతాయి. ఫంగస్ కు తేమగా ఉండే ప్రదేశం అనువైంది. అంతేకాదు అది అథ్లెట్స్ ఫుట్ కు దారితీస్తుంది. కాబట్టి పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలను కడిగినప్పుడు నీరు చాలా వేడిగా ఉండకూడదు. గొరు వెచ్చగా ఉంటే మంచిది.
నీటిలోని మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. అందుకని పాదాలను దుమ్ము, ధూళి, సూర్యరశ్మి నుండి పాదాలను కాపాడుకోవడానికి షూ వేసుకోవాలి. స్నానం చేయడానికి ముందు పాదాలను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పాదాలపై తేమ తయారవకుండా ఉండేందుకు టాల్కం పౌడర్‌ను అద్దాలి. ఎక్కువ సమయంపాటు పాదాలు నీటిలో ఉండకుండా చూసుకోవాలి. లేనిపక్షంలో పాదాల చర్మం గట్టిబడిపోయి పగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది నొప్పి, పుండ్లు సంక్రమణకు కూడా కారణమవుతుంది.
పాదాలకు మాయిశ్చరైజర్ కలిగించే క్రీములను పాదం కింది భాగంతోపాటు వేళ్ల మధ్యన మెత్తగా రుద్దాలి. కాలిగోర్లు పెరగ్గానే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలి. లేనిపక్షంలో ఇన్‌ఫెక్షన్ తయారయ్యేందుకు అవకాశముంటుంది. నిత్యం రాత్రి పడుకునేముందు పాదాలను మురికి లేకుండా బాగా కడిగి తుడుచుకోవాలి. తరచూ ఫుట్ మసాజ్ ని చేయడం వలన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫుట్ ప్రాబ్లెమ్స్ తలెత్తవు.
పాదాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
పాదాలను కాపాడుకోవటం షూ ఎంపిక నుంచే మొదలెట్టాలి. పాదం వంపు వద్ద మంచి దన్ను, మడమ కింద కాస్త మెత్తగా ఉండే షూ ఎంచుకోవటం మేలు. అలాగే మడాలు మరీ ఎత్తుగా లేకుండానూ చూసుకోవాలి. వేళ్లు లోపలి వైపులకు నొక్కుకుపోకుండా ముందు భాగంలో తగినంత స్థలం ఉండే షూ తీసుకోవాలి. వీలైనప్పుడల్లా పాదాలను కాస్త సాగదీయటానికి ప్రయత్నించండి. దీంతో నొప్పి తగ్గుముఖం పడుతుంది. బిగుతుగా అయిన కండరాలు, కండర బంధనాలు సాగి వదులవుతాయి. ప్రతిరోజూ సబ్బు, గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ల మధ్య తడిలేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. దీంతో ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పాదాల ఆరోగ్యమూ మెరుగవుతుంది.
నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివన్నీ పాదాల కండరాలు తేలికగా కదలటానికి, బలోపేతం కావటానికి, రక్తప్రసరణ మెరుగవటానికి తోడ్పడతాయి. ఫుట్ స్ట్రెచ్‌లు మరియు మసాజ్ పాదాలు ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా పనిచేస్తాయి. అదే విధంగా మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారి విషయంలో పాదాలు మరింత జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పనిసరి.
చాలా మంది ముఖానికి తీసుకున్న శ్రద్ద పాదాల దగ్గరకు వచ్చేసరికి సరైన శ్రద్ద పెట్టరు. పాదాలపై శ్రద్ద పెట్టకపోతే తేమ తగ్గిపోయి రఫ్ గా కన్పిస్తాయి. అందువల్ల పాదాలపై కొంత శ్రద్ద పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయటం ద్వారా.. ముఖ్యంగా నడకతో పాదాలకు రక్తసరఫరా బాగా మెరుగుపడుతుంది. పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.