Weight Loss: బాగా లావున్నారా? ఇలా తింటే బరువు తగ్గడం ఖాయం

By manavaradhi.com

Updated on:

Follow Us
Obesity: Definition, Causes, Diagnosis, Treatment

బరువును పెంచేసే కారణాల్లో ఆహారం కూడా ఒకటి. ఎక్కువ తింటే బరువు, తక్కువ తింటే నీరసం. అయితే కావలసిన ఆహారాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు మిమ్మల్ని దరిచేరువు అనేది వైద్యుల మాట. బరువు తగ్గాలనుకున్న వారు ఏ ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం..!

ఆరోగ్యకరమైన బరువు అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. అధిక బరువు కలిగిన వారు తగ్గాలంటే డైటింగ్ చేయడం కంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే ఎక్కువ తక్కువలు కాకుండా, సరైన స్థాయిలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరైన బరువును సంపాదించుకోగలుగుతారు. బరువు ఎక్కువ ఉన్నారని కడుపు కాల్చుకోవడం మంచి పద్ధతికాదు. తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి.

కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది.

ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది. చక్కని పోషకాహారంతో పాటు వ్యాయామం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మేలు చేస్తాయి.

బరువు తగ్గడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ?
సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రుచి, శుచితో బాటు పౌష్టికాహార విలువలు ఇలా ఎన్నో అంశాలు ఆహారంతో ముడిపడి ఉంటాయి. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి.

ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. చాలామంది ఖాళీ స‌మ‌యాల్లో టీవీ చూస్తున్న‌ప్పుడు క్రంచీ, క్రిస్పీ స్నాక్స్ తిన‌డం చాలా మందికి అల‌వాటు. ఆలు చిప్స్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే వీటికి బ‌దులుగా పాప్‌కార్న్ చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు సంతృప్తిని పొందవ‌చ్చు. ఇందులో కొవ్వు అస్స‌లు ఉండ‌దు.

మనం తీసుకోనే ఆహారం తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.

మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి.

ఆహారం ఏమేం తినాలి అనే దానితో పాటు ఏ విధంగా తినాలి అనే స్పష్టత కూడా ఉండాలి. బరువు తగ్గడానికి కొంతమంది పగలంతా తక్కువ ఆహారం తింటుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఏ పార్టీ పేరుతోనో పూటుగా లాగించేస్తారు. ఇలా చేస్తే అసలు బరువు తగ్గరు. ముఖ్యంగా లేట్ నైట్ డిన్నర్లు మానేయాలి. బరువు తగ్గాలనే ఉద్ధేశంతో కొందరు ఉదయం అల్పాహారం మానేస్తారు. ఇది మరింత ప్రమాదం. నిద్ర లేచిన తరువాత మూడు గంటల్లోపు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి.

బరువు తగ్గడానికి భోజనంలో కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేద్దామనుకుంటారు. నిజానికి కార్బొహైడ్రేట్లు చాలా తొందరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల మనకు తెలియకుండానే బరువు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే కార్బోహైడ్రేట్లను ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే ఇక్కడ ముఖ్యమవుతుంది.

ఏమైనా, బరువు తగ్గడానికి పరిమితిని పాటించడాన్ని మించిన పక్కా వైద్యం మరొకటి ఉండదు. మార్కెట్లో దొరికే ఫిజ్జ, డ్రింక్స్ క్యాలరీలతో నిండి ఉండటం వల్ల బరువు మరింతగా పెరుగుతుంది. కానీ బరువు తగ్గాలనుకుంటే వాటికి దూరంగా ఉండాలి. శరీర బరువు తగ్గాలంటే ముంచినీళ్ల తాగే విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. బాగా నీళ్లు తాగాలి. తిన్న తర్వాత కాస్త దూరం నడవడం, నూనె, మసాలా, కారం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారో, నీరసాన్ని దరి చేరనీయకుండా చూసుకోవచ్చో. ఈ పద్ధతులు పాటించడం ద్వారా సరైన స్థాయిలో ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment