ఒక భవనం నిలబడాలంటే ఇనుము ఎంత అవసరమో, మానవ శరీరం నిలబడడానికి కూడా ఐరన్ ఖనిజ పోషణ అంతే అవసరం. ప్రపంచ ఐరన్ లోప అవగాహన దినోత్సవం సందర్భంగా మానవ శరీరానికి ఇనుము ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తుంది, అసలు ఐరన్ లోపం వల్ల ఎదురయ్యే సమస్యలేవి, పరిష్కార మార్గాలు ఏంటి..?
మానవ శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ఖనిజాల్లో ఐరన్ ప్రధానమైనది. మానవ శరీరంలో రక్తాన్ని ఎర్రగా ఉంచడం మొదలుకుని, రక్తం పని తీరు, అలసట రాకుండా ఉండడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, మానసిక పనితీరును సక్రమంగా ఉంచడం లాంటి ఎన్నో పనులు చేస్తుంది. ఇవే గాకుండా ఇతర ప్రతి చర్యల్లో కూడా ఐరన్ పాత్ర కీలకమైనది. సాధారణంగా హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ఐరన్ పాత్ర కీలకమైనంది. ఎర్ర రక్త కణాలు శరీరమంతా ప్రాణ వాయువును ఉత్పత్తి చేసే కణాలు. శరీరంలో తగినంత హిమో గ్లోబిన్ లేనప్పడు కండరాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. ఇలాంటి పరిస్థితుల్లో అవి సరిగా పని చేయలేవు. ఇది అనీమియాకు దారి తీసే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఆహారం ద్వారా తగినంత ఇనుము అందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురౌతోందని వైద్యులతో పాటు పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. అదే విధంగా దీర్ఘ కాలిక రక్త సమస్యలతో బాధపడే వారు, ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమంలో భాగంగా రక్తం కోల్పోవడం లాంటివి ఈ సమస్యలకు కారణం అవుతున్నాయి. ఫలితంగా స్త్రీలలో అధికంగా రక్త హీనత సమస్యలు ఎదురౌతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం 20 శాతం మంది మహిళలు బాల్యం నుంచే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాను కలిగి ఉన్నారు. ఇది ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో జ్ఞాపక శక్తితో పాటు ఇతర మానసిక పనితీరు మీద ప్రభావం చూపుతున్నాయి.
ఐరన్ ఆవశ్యకత ఏమిటి, ఐరన్ లోపానికి కారణాలు ఏమిటి..?
సాధారణంగా 19 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు గల స్త్రీలకు రోజు వారి ఆహారంలో 18 మిల్లీ గ్రాముల ఐరన్ తీసుకోవాలి. అదే విధంగా గర్భిణులు రోజుకు 27 మిల్లీ గ్రాములు ఐరన్ తీసుకోవాలి. పురుషుల్లో ఈ పరిమాణం 8 గ్రాములు ఉంటే సరిపోతుంది. ఐరన్ లోపం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో శ్వాసలో ఇబ్బందులు ఒకటి. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు శ్వాసను పూర్తి స్థాయిలో తీసుకోలేరు. ఇలాంటి పరిస్థితి ఐరన్ లోపంగానే పరిగణించాలి. ఐరన్ లోపం చర్మం పాలిపోవడం అనే పరిస్థితికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి కూడా తగినంత ఐరన్ లేకపోవడం వల్లే ఎదురౌతుంది.
ఐరన్ లోపం వల్ల తరచూ తలనొప్పి సమస్య కూడా ఎదురౌతుంది. హిమోగ్లోబిన్ తక్కువ కావడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి ఎదురు కావచ్చు. అదే విధంగా గోళ్ళు పగలడం కూడా ఐరన్ లోపంగానే భావించాలి. శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందకపోవడం గోళ్ళ ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అదే విధంగా జుట్టు రాలిపోవడం, పొడిబారడం లాంటి సమస్యలు కూడా ఐరన్ లోపం కారణంగానే ఎదురౌతాయి. రక్తం ఫెర్రిటిన్ స్థాయిని తెలుసుకోవడం ద్వారా జుట్టు రాలడానికి ఐరన్ లోపమే కారణమా, కాదా అనే విషయాన్ని గుర్తించవచ్చు.
శరీరానికి అందాల్సిన ఐరన్ ఎంత, ఐరన్ లోపం వల్ల ఎదురయ్యే సమస్యలేవి..?
సాధారణంగా చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీలలో ఐరన్ లోపం అధికంగా కనిపిస్తుంది. పిల్లల్లో ఆరు నెలలు మొదలుకుని మూడు సంవత్సరాల వయసు మధ్యంలో ఐరన్ అధికంగా అవసరం అవుతుంది. ఇలాంటి పోషణ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అదే విధంగా నెలలు నిండకుండా లేదా బరువు తక్కువ ఉన్న శిశువుల్లో కూడా ఈ సమస్య ఇబ్బందులు సృష్టించవచ్చు.
సాధారణంగా ఐరన్ అధికంగా ఉన్న ఆహారం ద్వారానే శరీరంలో ఐరన్ ను ఓ స్థాయికి తేవలసి ఉంటుంది. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఐరన్ మాత్రలు తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకే మాత్రల రూపంలో ఐరన్ పొందడం మంచిది కాదు. పౌల్ట్రీ ఆహారంలో, సముద్ర ఆహారంలో, బచ్చలికూర, పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో, బఠానీలు, బీన్స్, బ్రోకలి సహా ఇతర పప్పు ధాన్యాల్లో, కాల్చిన బంగాళదుంప, నువ్వులు, జీడిపప్పు, శెనగలు, డార్క్ చెక్లెట్ లాంటి ఆహార పదార్థాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఐరన్ శోషణ పెంచడానికి సాయం చేస్తాయి. ఐరన్ ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు సి విటమిన్ ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది ఐరన్ శోషణను పెంచుతుంది. ఐరన్ లోపాన్ని ఆహారం ద్వారా మాత్రమే పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి.