Mental Health : మానసిక ఆరోగ్యం కోసం మీరేం చేస్తారు?

By manavaradhi.com

Published on:

Follow Us
Mental health: Definition, common disorders, early signs

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలసి ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా పరిగణిస్తారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం. సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల, మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి … దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడే తెలుసుకుందాం…

మనసే మనిషిని నిర్దేశిస్తుంది. మనసు అనేది కన్పించకపోయినా దాని మూల కేంద్రం మెదడే. అదే లేకుంటే మనిషి బతుకు గల్లంతౌతుంది. ప్రతి ఒక్కరు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే ఆ ప్రభావం ఆ వ్యక్తికే పరిమితం కాదు. అది సమాజంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.

దీర్ఘకాలి కంగా ఉండే శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడు పై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం మనిషిని శారీరకంగా క్షీణింపజేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢంగా ఉండడం ఎవరికైనా అవసరం. మానసిక రోగం పేరు చెప్తే చాలు అందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా తల్లడిల్లిపోతారు. అనేక ఇతర కారణాలతోబాటు సహనం లేకపోవడం… రకరకాల మానసిక వ్యాధులకు దారితీస్తుంది.

ప్రస్తుత ఆధునిక కాలంలో మానసిక సమస్యలు అధికమవుతున్నాయి. మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి అందని వస్తువులు అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఒత్తిళ్ళతో సహజీవనం చేస్తున్నారు. అందులో 20 శాతం మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సలు పొంది మానసికవ్యాధుల నుంచి బయటపడుతున్నారు.

మానసికవ్యాధులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, స్కిజోఫ్రీ నియా, ఇన్‌సోమ్నియా, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ లాంటి మానసికవ్యాధులుగా తీవ్రంగా వేదిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది.

బాహ్య పరిస్థితుల కారణంగా ఎలాగయితే శారీరకారోగ్యం ప్రభావితమవుతుందో మానసిక ఆరోగ్యం కూడా అదేవిధంగా ప్రభావితమవుతుంది . సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు మానసికారోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. పలు అంశాల సమష్టి ప్రభావంవల్ల పలు మానసిక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తుంటాయి.

శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలు కొన్నిసార్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. మానసిక రోగులకు మందులతోబాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాల ను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సెలింగ్‌, ఆతర్వాత మందులతో చికిత్సలు నిర్వహిస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చికిత్స చేయించుకోవాలి.

మానసిక జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు మానసిక వైద్యనిపుణులు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి. కాబట్టి ఒత్తిడి తొలగించే ధ్యానం, ప్రకృతిలో విహారం, నచ్చిన పాటలు వినడం లాంటివి, మీకు స్వాంతనను అందించే అలవాట్లను అలవరుచుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు.

Leave a Comment