Menopause : మెనోపాజ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

By manavaradhi.com

Published on:

Follow Us

మోనోపాజ్ దశ మొదలైందంటే స్త్రీలకు ఎన్నో సమస్యలు మొదలౌతాయి. నిజానికి ఈ దశలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారానే మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మహిళ యొక్క రుతుక్రమ ప్రక్రియ ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 40-50 ఏళ్ల వ‌య‌సులో సంభవిస్తుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా గర్భధారణ చేయగలిగే సామర్ధ్యం మహిళల్లో నిలిచిపోవడాన్ని సూచించే సహజ ప్రక్రియ ఇది.

మ‌హిళ‌ల బీజకోశాల నుంచి ప్రాజెస్టెరోన్, ఈస్ట్రోజెన్ విడుదల నిలిచిపోయినప్పుడు మెనోపాజ్‌ సంభవిస్తుంది. హార్మోన్లు తగ్గడం వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈదశలో మ‌హిళ‌లు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపరనేది వాస్తవం. ఫలితంగా దేశంలో 80 శాతం మహిళలు అనేక రోగాల బారిన పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతారు. మెనోపాజ్ ద‌శ‌లో ఇరిటేషన్‌ పెరుగుతుంది. చికాకు పడుతుంటారు. కొంతమందిలో డిప్రెషన్‌కు లోనవుతారు. మతిమరుపు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించినా అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యల అన్నీఇన్నీ కావు. మానసికంగానూ, శారీరికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. మెనోపాజ్‌ మొదలైనప్పటి నుంచి మహిళల్లో నిద్రలేమి సమస్య కాస్త ఎక్కువవుతుంది. హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులే దానికి కారణం. ఆ ప్రభావం వల్ల అతిగా తినడం మొదలుపెడతారు. దాంతోపాటే షార్ట్‌టర్మ్‌ మెమోరీ లాస్‌ అవుతుంది. అంటే ఉన్నట్టుండి ఏ పని చేస్తున్నామో మర్చిపోవడం, ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం, అప్పుడే చెప్పిన విషయం మర్చిపోవడం… ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఒక్కసారిగా తల వేడెక్కిపోవడం, విపరీతంగా చెమటలు పోయడం వంటి సమస్యలతో కంటి మీద కనుకే పట్టకుండా పోతుంది.

చాలామంది మ‌హిళ‌లు మెనోపాజ్ లో ఒత్తిడి, డిప్రెష‌న్‌ని ఫేస్ చేస్తారు. దీని కారణంగా చాలామంది నిద్రలేమితో భాదపడుతుంటారు. కాబ‌ట్టి నిపుణుల స‌ల‌హాతో ఒత్తిడి త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధ పడుతుంటే వైద్యుల్ని సంప్రదించాలి. సరైన సమయంలో ఈ సమస్య గుర్తించకపోతే ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

  • 30 ఏళ్ల‌లో శ‌రీరం ఎలా ఉంటుందో.. మెనోపాజ్ లో కూడా అలానే ఉండ‌దు. కాబ‌ట్టి.. నిపుణుల స‌ల‌హా ప్ర‌కారం వ్యాయామం చేయ‌డం అవ‌స‌రం.
  • ఎంత వీలైతే అంత న‌డ‌వ‌డం మంచిది. లిఫ్ట్ ల‌కు బదులు స్టెప్స్ ఉప‌యోగించ‌డం మంచిది. స‌రుకుల కోసం వెళ్లిన‌ప్పుడు న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు కంట్రోల్ లో ఉంటుంది. ఈ అల‌వాటు మెట‌బాలిజంను స‌జావుగా ఉంచ‌డ‌మే కాకుండా.. బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.
  • శారీరక వ్యాయామం , నడక వంటివి చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. త‌గినంత విశ్రాంతి తీసుకొవాలి. స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌గానే డీలా ప‌డిపోకుండా మాన‌సికంగా దృఢ‌త్వాన్ని అల‌వ‌ర్చుకోవాలి. మానసికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటే సైకాలజిస్టును సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకోవాలి.
  • రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవటానికి ముందు కాఫీ, మద్యం వంటివి తీసుకోకూడదు. పడకగదిలో టివి, కంప్యూటర్‌, లాప్‌టాప్‌ వంటి వినోద సాధనాలేవీ లేకుండా చూసుకోవాలి.
  • నిద్ర సమస్య తీవ్రంగా ఉంటే తప్ప నిద్రమాత్రలు వాడకూడదు. ఎక్కువ కాలం వేసుకోవడం వలన రకరకాల దుష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు. ఈ దుష్ప్రభావాలు ఏర్పడకుండా ఉండాలంటే.. యోగాసనాలు, వ్యాయామాలు చేస్తే ఫలితం కలుగుతుంది. అందువలన ప్రతిరోజూ నిద్రలేచిన తరువాత ఓ పావుగంట పాటు ఆసనాలు చేస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని.. వైద్యులు సూచిస్తున్నారు. దీని పట్ల అవగాహానతో జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ. సరైన పోషకాహారం తీసుకుంటూ.. ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో పెట్టుకోవచ్చు. దాని ద్వారా వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Leave a Comment