చాలా మంది రక్తపోటు అనగానే అధిక రక్తపోటును మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. లో బ్లడ్ ప్రెజర్ గా చెప్పే అల్ప రక్తపోటు కూడా శరీరాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చాలా మందికి రక్తపోటు తక్కువ ఉంటే హమ్మయ్య అనుకుంటూ ఉంటారు. నిజానికి రక్తపోటు తక్కువ అయినా అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. తక్కువ రక్తపోటు విషయంలో ఏయే విషయాలు తెలుసుకోవాలి..?
సాధారణంగా ఉండాల్సిన రక్తపోటు తక్కువ ఉంటే లో బీపీ అంటారు. వైద్య పరిభాషలో దీన్ని హైపోటెన్షన్ అంటారు. దీని వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలకు ఆక్సిజన్, ఆహార సరఫరా తగిన పాళ్లలో జరగదు. రక్తం అనేది రక్తపు నాళాలపైన ఒక ఫోర్స్‌తో ప్రవహిస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. దీన్ని బట్టే గుండె వేగం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. బీపీని సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీగా కొలుస్తారు. సిస్టోలిక్ బీపీ ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డయాస్టోలిక్ బీపీ 60- 80 మధ్యలో ఉంటే సరిపోతుంది. సాధారణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. లో బీపీలో ఈ సంఖ్యల కన్నా లక్షణాలను బట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 కన్నా తక్కువ ఉంటే లో బీపీగా వ్యవహరించవచ్చు. బీపీని ఎప్పుడు సాధారణ స్థాయిలో ఉండేలా చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. లో బీపీ సమస్య తరచు ఎదుర్కోంటుంటే దాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడం అనివార్యం.
లోబీపీ రావడానికి కారణాలు ఏంటి…?
లో బీపీ వచ్చేందుకు చాలా కారణాలు ఉన్నాయి.గుండె కవాటాల్లో సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా అవదు. అది లో బీపీకి కారణమవుతుంది. ఎండోక్రిన్ గ్రంథి సమస్యలు ఉంటే లో బీపీ వస్తుంది. థైరాయిడ్, లో బ్లడ్ షుగర్ కూడా ఇందుకు కారణమవుతాయి. నీళ్లను ఎంత తాగినప్పటికీ తీవ్రమైన డీహైడ్రేషన్ సమస్య ఉంటే అది లో బీపీకి దారి తీయవచ్చు. శరీరం లోపల ఎక్కడైనా అంతర్గతంగా గాయమైన రక్త స్రావం ఎక్కువగా ఉంటే అది లో బీపీ వచ్చేందుకు కారణమవుతుంది. రక్తంలో పలు బాక్టీరియాలు, వైరస్‌లు ప్రవేశించి ఇన్‌ఫెక్షన్ అయినా లో బీపీ వస్తుంది. పలు రకాల ఆహారాలు, మెడిసిన్స్ పట్ల అలర్జీలు ఉంటే అది లోబీపీ వచ్చేందుకు కారణమవుతుంది. మనం తీసుకునే ఆహారంలో తగినంత విటమిన్ బి12, ఫోలేట్ లేకపోతే అది రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో లో బీపీ వస్తుంది. విటమిన్లు విటమిన్ బీ12, మరియు ఇ – లో బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాదంపప్పు, పాలకూర, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్, చేపలు తినాలి. దీనికి అదనంగా వైద్యుడి సలహాతో విటమిన్ ట్యాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు. కాఫీలో కెఫీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తాత్కాలికంగా పెంచడంలో సహకరిస్తుంది. ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలోనూ ఉప్పు నీరు తాగకూడదు. ఎక్కువ ఉప్పు శరీర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
లోబీపీ నుండి బయటపడే మార్గాలేవి…?
లోబీపీ లక్షణాలు గుర్తుపట్టడం కొద్దిగా కష్టం. అయితే కళ్లు తిరగడం, నీరసంగా, అలసటగా అనిపించడం వంటివి కనిపిస్తే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. లోబీపీ ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ, వేడి సూప్.. వంటివి సేవించడం మంచిది. శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకని రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పొట్ట ఫుల్‌గా ఉంటే బీపీ స్థాయి తగ్గుతుంది. అలాగే వేపుడు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని, రోజులో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి. లోబీపీ ఉన్నవారు నిద్రించినప్పుడు సడెన్‌గా లేస్తే తల తిరగడం, గుండెదడగా అనిపించడం జరుగుతుంది. అందుకని నెమ్మదిగా లేవాలి. లోబీపీ ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవిడం వల్ల యూరియా, క్రియాటినిక్ లాంటి పదార్థాలు రక్తంలో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి. లోబీపీ తీవ్రమై షాక్ వచ్చి ప్రాణాపాయం కలగొచ్చు. ఏదైమైనా లోబీపీ లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.