Vijayakanth : డీఎండీకే చీఫ్, సినీ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

By manavaradhi.com

Updated on:

Follow Us

Vijayakanth Passed Away : ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ విజయ్​కాంత్​ కన్నుమూశారు. ‘కెప్టెన్‌’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. 1994లో ‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్‌ పురస్కారం), 2001లో ‘కళైమామణి అవార్డు’ (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో ‘బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు’, 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు. పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు.

తమిళనాడులోని మధురైలో విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ ‘సగప్తం’, ‘మధుర వీరన్‌’ చిత్రాల్లో నటించారు. నిజానికి విజయకాంత్ గారి అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి అగుపెట్టిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. విజయకాంత్ తన 27 సంవత్సరాల వయసులో వెండితెరపై తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుమ్‌ ఇలమై 1979 సంవత్సరంలో విడుదైలైంది. అయితే ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తరువాత అనేక సినిమాల్లో ఆయన హీరోగా ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు.. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015).

విజయకాంత్ కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్నారు. తరువాత నెమ్మదిగ సినిరంగంలో నిలదొక్కుకుని తమిళనాట తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విజయకాంత్‌.. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. విజయకాంత్ 100వ చిత్రం కెప్టెన్‌ ప్రభాకర్‌ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే.

విజయంత్ తన హీరోగా నటించిన ప్రతి సినమాలో మంచి సందేశం ఉండేలా చూస్తారు. తన రెమ్యునేషన్ విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు.. సినిమా అంత చిత్రీకరణ పూర్తి అయిన తరువాతే తీసుకునేవారు.. అంతేకాదు నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉంటే పారితోషకం తీసుకునేవారు కాదు. అంతటి గొప్ప మనిషి విజయకాంత్. తన కెరీర్‌లో విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ, ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి అక్కడా మంచి విజయాలు సాధించాయి. విజయకాంత్ హీరోగానే కాదు దర్శకత్వ భాద్యతలు కూడా వహించారు.. ఆ సినిమా పేరు ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. అంతే కాదు నిర్మాతగా తన బావ ఎల్‌.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు.

Leave a Comment