నిత్యం అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు. మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల అనేక రకాలైన బ్రీతింగ్ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మనం ప్రతి నిత్యం ఇంట్లో వాడే వస్తువుల పట్ల తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఊపిరి సమస్యలకు దూరంగా ఉండవచ్చు..
నిత్యం ఆరోగ్యంగా జీవించాలంటే .. మంచి సమతుల ఆహారంతోపాటు సరైన జీవన విధానం కూడా అవసరమే. పరిశుభ్రమైన గాలి, వెలుతురు వచ్చే ఇంట్లో నివసించాలి. చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లు గాలి ద్వారానే సోకే ప్రమాదం ఉంది. ఇంట్లోకి సరిగ్గా గాలి వచ్చే విధంగా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.. లేదంటే సరైన గాలి లభించక అనేక రకాలైన బ్రీతింగ్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
కొంతమంది క్లీనర్‌లలో కఠినమైన రసాయనాలను ఉపయోగిస్తారు ..ఇవి చాల వరకు శ్వాస సమస్యలను కలిగిస్తాయి. అంతే కాదు ఇవి అలెర్జీ లేదా ఉబ్బసం రావడానికి ప్రేరేపిస్తాయి. వీటిని కోనుగోలు చేసేముందు లేబుళ్ళను జాగ్రత్తగా చదవండి. సుగంధ ద్రవ్యాలు లేదా మండే పదార్థాలు ఉన్న వాటికి దూరంగా ఉండండి. ఇంటిలో ఎప్పుడు తాజా పండ్లు మరియు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా అవి ఎక్కవ రోజులు నిల్వ ఉంచితే వాటి మీద ఫంగస్ ఏర్పడి వాటి ద్వారా శ్వాస సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బయటి కాలుష్యమే కాదు ఇంటి కాలుష్యం కూడా ఆస్తమాకి కారణమవుతుంది. ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి విడుదలయ్యే వాయువుల ప్రభావం వల్ల కూడా ఆస్తమా సమస్య వస్తుంది. చల్లని గాలికోసం ఏసీ వాడే మాట నిజమే అయినా మరీ తక్కువ ఉష్ణోగ్రతలు పనికిరావు. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ ఫంగస్ తో బాటు పలు క్రిములు వృద్ధి చెంది గాలితో బాటు ఊపిరితిత్తులలోకి చేరి తుమ్ములు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది.
ఏసీ ఉన్న గదిలో కనీసం ఒక్క కిటికీ అయినా ఉండాలి. అన్నివైపులా మూసిన గది వెంటనే చల్లబడినా గాలి నాణ్యత అనుకున్నంత గొప్పగా ఉండదు. అందుకే ఏసీ ఉన్న గది తలుపులు లేక కిటికీలు నాలుగు గంటలు ఒకసారైనా తీసి తాజా గాలి వచ్చేలా చూడాలి. ఇంటిలో పెంపుడు జంతువులు ఉన్నవారు తగిని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. లేదంటే అనేక రకాల సమస్యలు చుట్టు ముడతాయి. వాటికి రోజు స్నానం చేయించాలి లేదంటే వాటి ద్వారా అలెర్జీ కారకాల బారిన పడే ప్రమాదం ఉంది.
ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండేందుకు మనం సువాసనలు వెదజల్లేలా ఎయిర్ ఫ్రెషనర్స్ ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని ఉపయోగించడం ఇంటిలోని వారి ఆరోగ్యానికి చాలా హానికరం. శ్వాస సంబంధం వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సువాసనలు పీల్చితే అస్థమా, తలనొప్పి, గాలి పీల్చడంలో ఇబ్బందులు, గొంతులో నొప్పి తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కొన్ని సహజసిద్ధమైన ఎయిర్ ఫ్రెషర్స్ ను ఉపయోగిస్తే ఇంటిలో సుగందాలు వెదజల్లుతాయి.
అన్ని వస్తువులూ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం లేకపోయినా..? కొన్ని వస్తువుల్ని మాత్రం ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. చాలామంది వారానికోసారి దుమ్ము దులుపుదామని అనుకుంటారు. కానీ దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపారు వంటివి ఉపయోగించడానికి అసహ్యం అనిపిస్తాయి. అంతేకాదు దానిపై చేరిన దుమ్ము అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపడం చాలా అవసరం.
బెడ్స్ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. బెడ్‌షీట్ దులపటం, ముడతలు లేకుండా చేయటం, తలగడలు సరి చేయటంవంటివి తప్పకుండా చేయాలి. ఇంట్లో మొక్కలను పెంచుకోవటం వల్ల అందంతో పాటు, వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతాయి. స్వచ్ఛమైన గాలిని అందించడంలో వీటిదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. గుబురు మొక్కలు గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తాయి.
మన ఇల్లు పరిశుబ్రంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనిపట్ల అవగాహాతో ఎల్లప్పుడు మనం ఉపయోగించే వస్తువుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో మనం మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు. ఊపిరి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.