మన శరీరం మొత్తం చర్మం చేత కప్పబడి ఉంటుంది. అవసరాలను బట్టి మన చర్మం ఒక్కో చోట ఒక్కో విధమైన భద్రతను కలిగి ఉంటుంది. సాధారణంగా మన శరీరాన్ని ఎండ నుంచి, చలి నుంచి కాపాడుకునేందుకు కొన్ని రకాల లోషన్ లను వాడుతుంటాం. వాటినే ముఖం మీద వాడడం ద్వారా సమస్యలు రావచ్చు. ముఖం మీద వాడకూడని బాడీ కాస్మటిక్స్ ఎమిటో, ఎందుకో తెలుసుకుందామా.
మన శరీరం మొత్తం చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మ సంరక్షణ ద్వారా చాలా సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే చాలా మంది శరీరం మొత్తం ఉండే చర్మం ఒకటే అనుకుంటూ ఉంటారు. కానీ ముఖం మీద చర్మానికి, ఇతర భాగాల మీద చర్మానికి చాలా తేడా ఉందనే విషయాన్ని గ్రహించరు.
చర్మానికి పూసుకునే కొన్ని రకాల పదార్థాలనే ముఖానికి కూడా పూసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒకటి. బ్యాక్టీరియాతో పోరాడే ఈ ద్రావణం ముఖం మీద చర్మానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ సమస్య ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది. సాధారణ చర్మం మీద మేలైనా ప్రయోజనాలు అందించే ఈ ద్రావణం ముఖం మీద ప్రతికూల ఫలితాలు ఇస్తుంది.
శిశువులకు జీవన ఆధారం అయిన తల్లిపాలను కూడా కొంత మంది మొటిమలు తగ్గడానికి ఫేస్ ప్యాక్ లాంటి వాటి కోసం వాడతారు. ఇది హాని చేస్తుందని చెప్పలేం గానీ, దీనితో పోలిస్తే ల్యూరిక్ యాసిడ్ కలిగి ఉండే ఇతర ఫేస్ క్రీములు వాడడం మేలు చేస్తుంది. అదే విధంగా చర్మానికి వివిధ సమస్యల నుంచి ఉపశమనం కిలిగే విచ్ హేజెల్ లాంటి మొక్కలు సైతం ముఖానికి అదే స్థాయిలో మేలు చేస్తాయని చెప్పలేము. పైపెచ్చు ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది. అదే విధంగా గాయాలకు వాడే హైడ్రో కార్టిసోన్ క్రీము లాంటివి కూడా ముఖం మీద చర్మానికి హాని కలిగిస్తాయి.
డియోడరెంట్ ల వల్ల కూడా ముఖానికి హాని కలిగే ప్రమాదం చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉండడం వల్ల వీటిలో ఉండే రసాయనాలు ముఖానికి హాని చేస్తాయి. అలాగే చాలా మంది తేనెని కూడా ముఖానికి మంచిది అని పూసుకుంటూ ఉంటారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులా పని చేస్తుందని భావిస్తుంటారు. అయితే పరిశోధనలు చెబుతున్న విషయం ఏమిటంటే తేనెకంటే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు ఎక్కువ మేలు చేస్తుంది.
మరికొంత మంది జుట్టుకు వేసుకునే రంగును గడ్డానికి, మీసాలకు దానితో పాటు కనుబొమలకు కూడా వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా హాని చేస్తుంది. దీనిలో ఎక్కువ భాగం పెరాక్సైడ్ ఉన్న కారణంగా చర్మానికి అలర్జీల వంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే కనుబొమ్మలకు డై వేసుకోవడం కంటే మస్కరా లేదా ఐ షాడో పౌడర్ లాంటివి వాడమని వైద్యులు సలహా ఇస్తారు.
శరీరం నుంచి వచ్చే విసర్జక పదార్థాలు కూడా ముఖం మీద చర్మానికి తగలడం మంచిది కాదు. వీటి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. జుట్టుకు వేసుకునే స్ప్రే కూడా ముఖ చర్మానికి చాలాహాని కలిగిస్తుంది. దీని వల్ల ముఖం పొడిబారే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే నీటిని వాడడమే మంచిదనేది వైద్యుల సలహా.
మన భారతీయుల్లో ఎక్కువ మంది నిమ్మరసం, కొబ్బరి నూనె లాంటివి ముఖానికి పూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనె పూసుకోవడం చాలా ఎక్కువ. నిమ్మకాయంలో విటమిన్ సి ఉన్నప్పటికీ, అందులో ఉండే ఆమ్ల స్వభావం ముఖ చర్మానికి హానికారకం. అదే విధంగా కొబ్బరి నూనె సైతం చర్మానికి పూసుకోవచ్చు గానీ, ముఖం మీద పూసుకోవడం వల్ల ముఖం పొడిబారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బాగా వేడిగా ఉండే నీరు సైతం ముఖ చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ముఖ చర్మం సున్నితత్వం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే వేడినీటి స్నానం చేసే వారు ముఖం కడిగేటప్పుడు నీరు ఎలా ఉందనే విషయాన్ని గమనించుకోవాలి. సాధారణంగా మనం పూసుకునే బాడీ లోషన్ కూడా ముఖానికి చాలా హాని కలిగిస్తుంది. అలాంటి వాటి విషయంలో ఒక్కసారి లేబుల్ ను పూర్తిగా చదవాలి. కచ్చితంగా ముఖానికి వాడవచ్చు అనేవి మాత్రమే ముఖానికి పూసుకోవడం మంచిది.
గ్లూ, నెయిల్ పాలిష్ లాంటివి కూడా చాలా మంది తెలియక ముఖ అలంకరణ కోసం వాడుతూ ఉంటారు. మేకప్ చేసుకునేటప్పుడు ఇతర మార్గాల్లో ప్రయోజనం కలిగించే పదార్థాలను వాడాలే తప్ప, ఇలాంటి వాటిని వాడడం చర్మానికి తక్కువ కాలంలో ఎక్కువ హాని చేసే అవకాశం ఉంటుంది.