ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శుక్రవారము, తేది. 20.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతి దేవి (మూలానక్షత్రం) గా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీసరస్వతీదేవి గా అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున. వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్ధినీ విద్యార్థులు సర్వ విద్యల యందు విజయం పొందుతారు. భక్తులు మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీసరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయప్రదాయకం.
ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. గులాబీలు, తెల్ల చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యం పెడతారు. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది.