Diet Plan: పురుషుల కోసం హెల్తీ డైట్ ప్లాన్..!

By manavaradhi.com

Published on:

Follow Us
Foods to Boost Male Health

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తప్పని సరిగా తీసుకోవాలి.. ఆరోగ్యం విషయంలో ఆడ,మగ అన్న భేదం ఉండదు… కానీ కొన్నిసార్లు ఆహారం తీసుకునే విషయంలో లింగభేదం అవసరం. మగవారిలో మహిళలకంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. సాధారణంగా మహిళలకు రోజుకి 1200కేలరీలు అవసరం అవుతాయి. మగవారికి మరికొన్ని ఎక్కువ కావాలి. మరి పురుషులకు అన్ని క్యాలోరీలను అందించి.. ప్రత్యేకంగా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి.

చాలా మంది మగవారు ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకొనే వరకు ఏదో పనిలో నిమగ్నమై ..తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ద తీసుకోరు. మగవారు తమ ఆరోగ్యంపై కూడా కాసింత దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పురుషులకు అధికంగా ప్రొటీన్ అవసరం. ఇందుకోసం మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్, చేపలు, సముద్రపు ఆహారం తీసుకోవడం అవసరం.

సముద్రపు ఆహారాలు పీతలు, నత్తలు, ఇతరత్రా వాటి నుంచి ఎక్కువగా జింక్ లభిస్తుంది. హై ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం సాల్మన్, సర్దినెస్, హెర్రింగ్ లాంటి చేపలను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారిస్తాయి.

ఎక్కువ మంది పురుషులు పనిలో పడి తమ ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వేళకు సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అవసరం అని గుర్తుంచుకోవాలి. ఇందు కోసం రోజువారిగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, పిండిపదార్థాలు, విటమిన్స్, మినరల్స్ తప్పక ఉండాల్సిందే. పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు , కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి.

పురుషులు కెరొటినాయిడ్స్ ఉండే పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే టమోటోలను తినడం వల్ల పురుషులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. టొమోటోల నుంచి లైకోపీన్ అందుతుంది. లైకోపీన్ శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వీటిల్లోని విటమిన్ A,విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే పురుషులు తాము తీసుకునే ఆహారంలో విటమిన్లు లోపం లేకుండా చూసుకోవాలి.

శరీరానికి తక్షణ శక్తి కోసం పిండిపదార్ధాలు అవసరం. ఇవి తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో శక్తిగా మారుస్తాయి. కాబట్టి ప్రతిరోజూ తినే ఆహారంలో పిండిపదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. బంగాళదుంపలు, చిలగడదుంప లాంటి వాటిలో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అయ్యి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. దీనివలన మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రావు.

పురుషుల్లో కండపుష్టికి గుడ్డు చాలా అవసరం. రోజూ ఒక గుడ్డు తినాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్ లభిస్తుంది. పీచు పదార్థం కోసం బ్రౌన్ రైస్, ఓట్స్, తృణ ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ B పుష్కలంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ రాకుండా తృణధాన్యాలు రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాలతోపాటు పాలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా తీసుకుంటే మంచి క్యాల్షియం అందుతుంది. పాల ఉత్పత్తులు .. ముఖ్యంగా పెరుగు, మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను శుభ్రంగా ఉంచుతుంది.

సీజనల్ గా దొరికే పండ్లను రోజువారీ డైట్ లో చేర్చుకుంటే మంచిది. అలాగే రోజూ ఒకటే తరహా ఆహారం కాకుండా పోషక విలువలు ఉన్న రకరకాలైన ఆహారాలను తీసుకోవాలి. సాద్యమైనంతవరకు జంక్ పుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఆహారం ఒకేసారి కాకుండా ప్రతి మూడు గంటలకు ఒక సారి కొంచెం.. కొంచెంగా తీసుకోవడం ఉత్తమం.

వ్యక్తుల ఎత్తు, బరువు పనిని బట్టి సమతులాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లతోపాటు మాంసకృత్తులు కలిగిన ఆహార పదార్థాలు ఉండేలా ప్రణాళికతో ఆహార అలవాట్లు పెంపొందించుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యం జీవించగలం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

Leave a Comment