కొలెస్ట్రాల్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు. ఐనా … పెద్దగా పట్టించుకోని వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. ఐతే చెడు కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది.. దాని వల్ల కలిగే అనర్థాలేంటి? కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ప్రమాదం. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు. కొలెస్ట్రాల్ మైనపు పదార్థంలా ఉంటుంది. ఇది హార్మోన్లు, విటమిన్ డి, ఆహారాలను జీర్ణం చేసే పదార్ధాలను ఉత్పత్తి చేయడానికి అవసరం అవుతుంది. ఇది శరీరంలో అధికమైనప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది.
హై డెన్సిటీ లిపో ప్రోటీన్.. HDL దీన్ని మంచి కొలెస్ట్రాల్ గా వ్యవహరిస్తారు. లో డెన్సిటీ లిపోప్రోటీన్.. LDL.. దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. శరీరంలో అధిక స్థాయి కొలెస్ట్రాల్ రక్త నాళాలలో క్రొవ్వు నిక్షేపాలకు దారితీసి.. రక్త ప్రవాహంలో జోక్యం చేసుకుంటాయి. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి… శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం, తగ్గడం అనేది మనం తీసుకునే ఆహారం, జీవన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్దేశిస్తాయి. ఎక్కువగా నూనె ఉన్న పదార్థాలు , హై ఫ్యాట్ మాంసం, వెన్న ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, వేపుడు పదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఐదేళ్లకోసారి అయినా కొలెస్టరాల్ (లిపిడ్ ప్రొఫైల్) టెస్ట్ చేయించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు ప్రతి సంవత్సరం లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సిందే. కొలెస్టరాల్ కు సంబంధించి చేసే పరీక్షలో టోటల్ కొలెస్టరాల్ రీడింగ్ కూడా ఉంటుంది. ఎల్డీఎల్, హెచ్ డీఎల్ ఈ రెండింటిని కలిపి చూపించేది. 200 ఎంజీ/డీఎల్ (మిల్లీగ్రామ్ ఫర్ డెసిలీటర్) 200 లోపు ఉంటే సరిపోతుంది. 220కి పైన 240 వరకు ఉంటే దాన్ని అధికంగా, ఆపైన ఉంటే అత్యధికంగా ఉన్నట్టు పరిగణిస్తారు.
ఎల్ డీఎల్ కొలెస్టరాల్ 100 ఎంజీ/డీఎల్ లోపు ఉంటే మంచిది. 110-120 వరకు ఉన్నా నష్టం లేదు. 130 నుంచి 150 వరకు ఉంటే దాన్ని కొంచెం ఎక్కువగా ఉన్నట్టు, 190కి పైన చాలా అధికంగా ఉన్నట్టు భావిస్తారు. మధుమేహం నుంచి మొదలుపెడితే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సమస్యలకు కారణం స్థూలకాయమే. అయితే దీనికి కారణం శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోవడమే. ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోతే అది రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని కూడా పెంచుతుంది.
ఇటీవలి కాలంలో ఆహార పద్ధతులు, శారీరక వ్యాయామం గాడితప్పడంతో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. దాని వల్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడుతుంటాయి. అయితే హెచ్‌డీఎల్ పెంచుకుంటే అది గుండెకు రక్షణ కవచంగా నిలుస్తుందని డాక్టర్లు పేర్కొంటారు. హెచ్‌డీఎల్ ఎంత ఎక్కువగా ఉంటే శరీరానికి అంత మంచిది. దీని వల్ల గుండె నొప్పి రాకుండా ఉంటుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణకు జాగ్రత్తలు
ఆరోగ్యవంతులైన వారు రోజులో 300 మిల్లీ గ్రాములకు మించి కొవ్వు తీసుకోకూడదు. రోజూ నిర్ణీత సమయం మేర శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలన్నది వైద్యుల సిఫారసు. కనీసం అరగంట వేగంగా నడిచినా సరిపోతుంది. అస్తమానం కూర్చునే కాకుండా మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. ఎందుకంటే స్థూలకాయం కూడా కొలెస్టరాల్ పెరిగేందుకు కారణమవుతుంది. పొగ తాగడం, మద్యపానం అలవాట్లను మానివేయాలి. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే ఇది అవసరం.జీనవ విధానంలో మార్పులు ఆహారంలో మార్పులు, వ్యాయామం చేసుకోవడం ద్వారా కొలెస్టరాల్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.
కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. జంతు ఉత్పత్తులు, మాంసం, చీజ్ వినియోగం తగ్గించుకుంటే సరిపోతుంది. కొన్ని రకాల మాంసంలో, కొవ్వు అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, చాక్లెట్లు, బేక్డ్ గూడ్స్, బాగా వేయించిన ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. బాగా వేయించిన, శుద్ధి చేసిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.ఓట్స్, బార్లీ, ముడి ధాన్యాలు, బీన్స్, నట్స్, కనోలా, సన్ ఫ్లవర్ ఆయిల్, పండ్లలో యాపిల్, గ్రేప్స్, స్ట్రా బెర్రీస్, సిట్రస్ జాతికి చెందిన కమలా, బత్తాయి పండ్లు, సోయా, సోయా ఆధారిత ఉత్పత్తులు, చేపల్లో సాల్మన్, టునా, సార్డిన్స్ రకాలు, పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హాని చేసే కొవ్వు తగ్గిపోతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే .. ఆహార నియమాలు తప్పకుండా పాటించడం అవసరం. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా.. నిత్యం వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక డైట్‌ని, వ్యాయామాన్ని పాటించే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకుని అనుసరించడం మంచిది.