మనకు హాని చేసే సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు రెండూ మన శరీరంలో ఉంటాయి. మన శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.. ఐతే ఈ బ్యాక్టీరియాలు చాలా వరకు శరీరానికి మేలే చేస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మన జీర్ణక్రియకు మంచి బ్యాక్టీరియా ఎంతగానో సహాయపడుతుంది.
మన ఆరోగ్యం విషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను జీర్ణం చేయటం దగ్గర్నుంచి రోగనిరోధకవ్యవస్థకు తర్ఫీదు ఇవ్వటం వరకూ ఎన్నెన్నో పనులు నిర్వర్తిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ శాతం మన పొట్టలోనే దాగి ఉంటాయి. జీర్ణవ్యవస్థలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు.. శరీరంలో ఉండే చెడు సూక్ష్మ క్రిములతోనూ ఇవి పోరాడతాయి.
చెడు, మంచి బ్యాక్టీరియాలు పొట్టలో సమంగా ఉంటే దాన్ని ఈక్వలిబ్రియమ్ అని పిలుస్తారు. ఐతే కడుపులో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడు బ్యాక్టీరియా పెరిగిన పక్షంలో మనకు క్రాన్స్, అల్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా కారణంగా గుండె సమస్యలు రావచ్చు.
బాక్టీరియా అంటే కేవలం చెడు చేసేది మాత్రమే కాదు. పాలని పెరుగుగా మార్చే సూక్ష్మజీవులు కూడా బాక్టీరియా కిందకే వస్తాయి. అలాంటి మంచి బాక్టీరియా మన శరీరంలోనూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఈ మంచి బాక్టీరియానే! దీనినే గట్ బ్యాక్టీరియా అంటారు. మన పేగులలో ఉండే ఈ తరహా బాక్టీరియా కేవలం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే కాకుండా… శరీరంలో వాపుని తగ్గించే ప్రయత్నం చేస్తాయట! దాంతో గుండె ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
తరచూ యాంటీబయాటిక్స్ వాడటం, పొగ తాగడం, తరచూ క్లోరిన్ నీళ్లు తాగడం లాంటి అలవాట్లతో పేగులలోని గట్ బ్యాక్టీరియా దెబ్బతిని తీవ్ర అనారోగ్యాలకి దారితీస్తుంది. కడుపులో బ్యాక్టీరియా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కంటి చూపు, ధ్వని శ్రవణం, రుచి తెలుసుకోవడం, వాసన చూడడం వంటి వాటిపై ప్రభావం ఉంటుందంటున్నారు.
కడుపులో మంచి బ్యాక్టీరియా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో మంచి బ్యాక్టీరియా.. మనం పుట్టిన సమయంలోనే తల్లి నుంచి సంక్రమిస్తుంది . పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్ల నుంచి దాని ప్రభావం పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారాలు కొన్ని ప్రొబయాటిక్స్ గా పని చేస్తాయి. ఈ ప్రో బయాటిక్స్ మనకు ఎక్కువగా పాలు, పాలపదార్థాల నుంచి లభిస్తాయి. ఇవి కడుపులోని మంచి బ్యాక్టీరియాను మరింత పెంచి సమతుల్యతను కాపాడతాయి.
ప్రొ బయాటిక్స్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది ప్రేవుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ప్రొబయాటిక్స్ చైతన్యవంతంగా లేని బ్యాక్టీరియాను నాశనం చేసి మంచి బ్యాక్టీరియాకు ఊతమిస్తాయి.
జీర్ణకోశంలో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆహారం జీర్ణమవడం, పోషకాల శోషణ, శరీరానికి శక్తిని ఇవ్వడం, వ్యాధి నిరోధక స్పందనల్లో ‘గట్’ సూక్ష్మజీవులదే కీలక పాత్ర. కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అనవరసంగా యాంటీబయాటిక్స్‌ను వాడకపోవడం ద్వారా పొట్టని పదిలంగా కాపాడుకోమంటున్నారు వైద్యులు.