సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అన్ని మాసాల్లోకి కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. కార్తికస్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తితత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. కార్తిక సోమవారాలు మరింత ప్రత్యేకం.
ఈ మాసంలో ప్రాతఃకాలపు స్నానాలకు ఎంతో ప్రాముఖ్యమిస్తారు. ప్రాతఃకాలంలో చేసే స్నానం రుషీస్నానం, ఉత్తమమైంది. ఈ మాసం ప్రవేశించేనాటికి వర్షరుతువు సమాస్తమవుతుంది. వర్షజలధారలు సమస్తమూలికల సారాన్ని, భూపొరల్లోని ధాతువుల సారాన్ని కలగలుపుకొని నదుల్లోకి అంతర్వాహినిగా వచ్చిచేరతాయి.
ఔషధజలంలా జలప్రవాహాలు పరిఢవిల్లుతాయి. ప్రవాహవేగానికి ఎదురుగా నిలబడి స్నానమాచరిస్తే- జలప్రవాహాల్లో ఔషధీయగుణాలు, విద్యుత్ తరంగాలు దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. స్నానానంతరం రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల వద్ద దీపారాధన, దైవారాధన చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వృక్షసంపద ఆరోగ్య ప్రదాయినులు. యజ్ఞయాగాదుల్లోనూ ప్రముఖ పాత్రవహిస్తాయి యజ్ఞ ద్రవ్యాలుగా. జ్ఞానానికి చిహ్నం దీపం. సర్వసంపదలు జ్ఞానంవల్ల లభిస్తాయి. ఈ మాసంలో దీపదానం ప్రాశస్త్యం చాలా ఉంటుంది. ఈ మాసం ఆసాంతం దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానంచేస్తే- అనంతపుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయంటారు.
కార్తిక పౌర్ణమిరోజున శ్రీమహావిష్ణువును షోడశోపచారాలతో పూజిస్తే యశస్సును, సామ్రాజ్యవైభవాలను పొందుతారని ‘పురంజయుని’ చరిత్ర తెలియజెబుతోంది. కార్తిక సమారాధన ఐకమత్యానికి నిదర్శనం. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు విడనాడి సామూహిక భోజనాలు ఆచరించాలన్నదే శాస్త్రవచనం. ఇది సమష్టి జీవన మాధుర్యాన్ని తెలుపుతుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తికశుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు శ్రీలక్ష్మీసమేతుడై పాలకడలిలో శేషపాన్పుపై శయనిస్తాడంటారు. ఇది చాతుర్మ్యాస్యం. కార్తిక శుద్ధ ఏకాదశితో చాతుర్మాస్య వ్రతం పరిసమాప్తమవుతుంది. మానవ జీవితకాలంలో సగం ఆయుష్షు నిద్రకే సరిపోతుంది. మేల్కొని ఉండే జాగ్రదావస్థ, జీవిత స్థితిగతులను సువ్యవస్థీకృతమైన విధానంలో నడుపుకోవాలి. సమయపాలనకు, కాలానికున్న విలువను తెలియజెబుతుందీ వ్రతవిధానం.