ప్రస్తుతం ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువవుతుంది. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు. మరీ అలాంటప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. స్పాంజిల్లా ఉండే ఈ ఊపిరితిత్తులు గాలిలోంచి ఆక్సిజన్ ను సేకరించి.. శరీరానికి అందిస్తాయి. అదే సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర ఉత్పన్నాలను గాలిలోకి విడుదల చేస్తాయి. మనిషి జీవింత ఉన్నంతకాలం ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. రెండు నిమిషాల పాటు ఊపిరితిత్తులు పనిచేయకపోతే మరణం సంభవిస్తుంది. అంతటి కీలకమైన ఊపిరితిత్తులకు పలు రకాల ఇన్ఫెక్షన్లు, పొగతాగడం వంటి అలవాట్లు, గాలికాలుష్యం వంటివాటి కారణంగా వ్యాధులు వస్తాయి. ఇటీవలి కాలంలో ఆస్తమా, ఊపిరితిత్తుల కేన్సర్లు, ఇన్ఫెక్షన్లు, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలాంటి సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు.
- ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి దూరంగా ఉండేందుకు ముఖ్యంగా జీవనశైలిలో మార్పులుచేర్పులు చేసుకోవాలి.
- జల, వాయు కాలుష్యం జరగకుండా చూసుకోవాలి. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన గాలిని శ్వాసించాలి.
- హృదయ కండరాలకు బలం చేకూర్చే ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చిన్న పాటి వ్యాయామాలు చేస్తుండాలి.
- యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
- కార్బన పదార్థాలు విడుదల చేసే ఆయిల్ ఆధారిత పెయింట్స్ నివారించండి. క్లీనింగ్ ఉత్పత్తులలో అమ్మోనియా, బ్లీచ్ వంటి వాటిని దూరంగా పెట్టడం అత్యవసరం.
- ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసి గదులకు దూరంగా ఉండాలి.
- సినిమా హాళ్లు, ఆడిటోరియంలు లాంటి జన సమ్మర్ధం ఉన్నప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిది.
- కాలుష్యం కలగలసిన పొగమంచు ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది.
- ఫాగ్ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవమే మంచిది.
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సిగరెట్లు, బీడీల వంటివి తాగడం మానేయాలి. సిగరెట్ లో ఉండే 7 వేల రసాయనాలు ఊపిరితిత్తుల్లోని 70 శాతం కణాలను నాశనం చేస్తుంది. మాములు వ్యక్తుల కంటే పొగ తాగే వారిలో కేన్సర్ వచ్చే అవకాశాలు 15 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంది. సిగరెట్ లు తాగడం మానేస్తే చాలా వరకు కేన్సర్ రాకుండా నియంత్రించవచ్చు.
దుమ్ము, ధూళికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్య భరిత ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తే.. తగిన మాస్కులు వినియోగించాలి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు.. తప్పకుండా కేన్సర్ పరీక్షలను చేయించుకోవాలి.ఆల్కాహల్ ఎక్కువగా తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శ్వాసక్రియ వేగం పెరిగి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఊబకాయం వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఎత్తుకు తగినట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. క్రమబద్ధమైన ఆహార నియమాలను పాటించాలి. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.