Pawan Kalyan: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ పవన్‌ షెడ్యూల్‌ పూర్తి

By manavaradhi.com

Published on:

Follow Us
Ustaad BhagatSingh

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. గబ్బర్ సింగ్ లాంటి పవర్ పుల్ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పవన్ అభిమానులకు దర్శకుడు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక ఫొటో పంచుకున్నారు.

ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్‌ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను పూర్తి చేశారు. ఆయన సపోర్ట్‌ వల్లే ఈ షెడ్యూల్‌ త్వరగా పూర్తయినట్లు హరీశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్‌ పాకినట్లే’’ అంటూ ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. పవన్‌ ఎనర్జీ సినిమాకు మరింత పవర్‌ను ఇచ్చిందన్నారు. సపోర్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హరీశ్ షేర్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పవన్‌ సింపుల్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్‌ – హరీశ్‌శంకర్‌ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల , రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ ‘ఓజీ’లో నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఇది రానుంది.

Leave a Comment