‘ అరుణకిరణ జాలై రంజితా సావకాశా
విదృత జపతటీకా పుస్తకా భీతిహాసా
ఇతర వరకారాఢ్య పుల్లకల్హాలసంస్థా
నివసత్తు హృదిబాలా నిత్యకల్యాణశీలా’
Sharan Navaratri Day 1: బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.. తొలి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు దర్శనాన్ని అందించారు. ఇంద్రకీలాద్రి పై నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పదని.. విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.
త్రివర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. ‘శ్రీ’ విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేయడం జరుగుతుంది. త్రిపుర సుందరీ దేవి అభయహస్తముద్రతో చేతిలో అక్షరమాల ధరించి ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం ఆమె ఆధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేసి కట్టెపొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.








