మహాలక్ష్మీదేవిగా: శంఖు, చక్రాలు, గద, అభయహస్తాలు, వడ్డాణం, కర్ణాభరణాలు, ధనరాశులు ప్రసాదించే అమ్మవారిగా అలంకరణ చేస్తారు.
సరసిజనయనే సరోజహస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్।।
Sri Mahalakshmi Devi Avataram: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరి నివేదిస్తారు.

రుగ్వేదం పదో మండలంలోని శ్రీసూక్తం ఈ తల్లి వైభవాన్ని కీర్తిస్తుంది. అగ్ని, మత్స్య పురాణాలు ఈమె ఆకృతి, శిల్పనిర్మాణ నియమాలు వెల్లడిస్తాయి. అష్ట లక్ష్ములకు ఈమె అధిష్ఠాత్రి. ఈ తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపదలతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్ర ఫలదాయిని. శ్రీసూక్త విధానంగా ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తరంతో ఈమెను అర్చించాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి. లక్ష్మీస్తోత్రాలు పఠించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి.








