విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి.
ప్రాతఃస్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తికశోభినాశం
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం।।
Sri Lalita Tripura Sundari Devi – త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంతో, సకల లోకాతీత కోమలత్వంతో తల్లి ప్రకాశిస్తుంది. సకల సృష్టి, స్థితి, సంహారకారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి వింజామరలు వీస్తుండగా, చెరకుగడ, విల్లు, పాశాంకుశాలు ధరించిన దివ్య స్వరూపంతో తల్లి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈమెను ఉపాసించడం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని, దారిద్య్ర దుఃఖ వినాశనం జరుగుతుందని భక్తుల నమ్మిక. ఈమెకు కుంకుమార్చన ప్రీతి. తనను కొలిచే ముత్తయిదువులకు మాంగల్యభాగ్యాన్ని వరంగా అనుగ్రహిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించి, శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి. పులిహోర అమ్మవారికి నివేదన చేయాలి. సువాసినులను సకల ఉపచారాలతో అర్చించి, భోజనం పెట్టాలి.









