Mopidevi Temple – మోపిదేవి సుబ్రహ్మణ్యుని మహత్యం

By manavaradhi.com

Published on:

Follow Us
Subramanya Swamy Temple Mopidevi

కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణా నదీతీర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్” అని అగస్త్యమహర్షిచెప్పాడు. ఆయనే స్వయంగా ఇక్కడ పడగలా కనిపించే శివలింగాన్ని మోపిదేవిలోని పుట్టమీద ప్రతిష్టించాడు. ఆ పుట్టలోనే కుమారస్వామి పామురూపంలో తపస్సు చేస్తున్నాడని తెలియచేశాడు. పురాణకాలంలో కుమారస్వామి తాను చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తంగా మోపిదేవి పుట్టలో సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. అగస్త్యుని తరువాత చాలాకాలానికి వీరారపు పర్వతాలు అనే కుమ్మరి కులస్తుడు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడు.

మోపిదేవిని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవారు. ఇక్కడ స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుంచి దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామి వారి ఆలయంలో పిల్ల కు చెవులు కుట్టించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పుట్టలో పాలు పోసినా, పొంగలి నివేదన చేసినా కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతుదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో కల్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

మోహినీపురమే మోపిదేవి!
తొలుత మోహినీపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా మారింది. మోపిదేవి ఆలయంలో పాముచుట్టలపైనే శివలింగం ఉంటుంది. పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యుని మహత్యం
మోపిదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో అభిషేకం, అర్చన పూజలు జరిపించుకుంటే దృష్టిలోపం, వినికిడి లోపం, శారీరక దౌర్భల్యం, చర్మసంబంధ వ్యాధులతో బాధపడేవారు వారివారి బాధల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు విద్య, ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతుంది.

నాగదోష పరిహారం
మోపిదేవి క్షేత్రంలో ముఖ్య విశేషమేమిటంటే ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యేవారికి శ్రీఘ్రంగా వివాహం అవుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. నాగదోషంతో రకరకాల సమస్యలు ఉన్నవారు నమ్మకం, విశ్వాసంతో మోపిదేవి ఆలయంలో పూజలు జరిపించుకుంటే దోషపరిహారం అవుతుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః

Leave a Comment