దుర్గాదేవిగా: శార్దూల వాహనంపై స్వర్ణ కిరీటం, బంగారు త్రిశూలం, సూర్య, చంద్రులు, శంఖుచక్రాలతో అలంకరణ చేస్తారు.
Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శమనిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు.. ఇక, శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తారు.. దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. మరోవైపు, అమ్మవారి దర్శనాకి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుండగా.. వారికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.









