Sri Annapurna Devi Alankaram Day 3: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఇక, మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. నేడు మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।
చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్నపూర్ణాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. సకల చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రాన్ని జపించి అమ్మకు నివేదన చేయాలి. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలలో ఈ తల్లి చిత్రపటం ఉంచి, హారతులు ఇవ్వాలి.








