ప్రతి మనిషికి నిద్ర చాలా ముఖ్యం. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా…. శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే చాలా మందికి పగటిపూట ఓ కునుకు తీసే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ చిన్న కునుకు తీయడం ద్వారా కొవ్వు పెరిగి లావైపోతారని, రాత్రిపూట నిద్ర రాక ఇబ్బంది పడతారని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ సరైన పద్ధతిలో, సూచించిన సమయం పాటు పడుకుంటే ఎలాంటి సమస్యలు ఉండకపోగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
నిద్ర అనేది అందరికీ తప్పనిసరైన జీవక్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు తప్పవు. రోజులో పని ఒత్తిడి వల్ల కూడా చురుకుతనం తగ్గి అలసిపోయినట్లుగా అనిపిస్తూ వుంటుంది. అలాంటప్పుడు, మధ్యాహ్నం టైంలో అలా ఓ కునుకు తీయడం చాలామందికి అలవాటు. వర్క్ చేసే వాళ్లు కూడా డే టైంలో ఓ పది నిముషాలైనా ఒక కునుకు తీస్తుంటారు. దీన్నే పవర్ న్యాప్ అంటారు. ఇంతకీ ఇది మంచిదేనా? మధ్యాహ్నం పడుకోవడం మంచి అలవాటు కాదని అనుకుంటుంటారు చాలామంది.
నీరసం, బద్ధకం ఉంటే అలా నిద్రొస్తుంది అనుకుంటారు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ స్టడీ ప్రకారం.. మధ్యాహ్నం నిద్ర.. వయసు పైబడిన వారు షార్ప్ గా ఉండేలా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండే వారి కంటే నిద్రపోయిన వారు మరింత ప్రశాంతంగా ఉంటారని రీసెర్చర్లు చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం ముగించాక చిన్నపాటి కునుకు తీస్తే చాలు. ఆ తర్వాత చలాకీతనం, చురుకుదనం వచ్చేస్తాయి.
మనలో చాలామంది తీరిక దొరికినప్పుడు కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పుడప్పుడు కంటినిండా నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి కూడా లభిస్తుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పగటిపూట చిన్న కునుకు తీయడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పగటిపూట పనుల గందరగోళం మధ్య చిన్నపాటి కునుకు తీసినా అది జ్ఞాపక శక్తి, మానసిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. కనీసం ఆరు నిమిషాలు నిద్రపోయినా కూడా మెదడులోని జ్ఞాపకశక్తిని పెంచే చర్య జరిగేందుకు అది దోహదం చేస్తుందన్నది పరిశోధకులు చేబుతున్నారు. కాబట్టి ఈ నిద్ర పగటిపూట పనివేళల మధ్యలో పొందితే మరింత చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతేకాదు మనం తీసే చిన్నకునుకు గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు ఉపకరిస్తుంది.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 10-20 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండుతుంది. ఆఫీసులో కొంత సమయం పనిచేసిన తరువాత ప్రొడక్టివిటి లెవల్స్ తగ్గడం వల్ల కొద్దిగా బద్దకంగా ఫీలవుతారు. అలాంటి సమయంలో చిన్నపాటి కునుకు తీయడం, చురదనం తిరిగి పొందడం వల్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చు.
రాత్రి ఎంతగా నిద్రించినా, మధ్యాహ్నం వేళ చిన్నపాటి కునుకు చాలా ఉపయోగంగా వుంటుంది. పగటి పూట మనం తీసే చిన్న కునుకును నాప్ అంటారు. నాప్ అంటే 10 నుంచి 20 నిమిషాలే ఉంటుంది. అలా కాకుండా దీని పేరుతో అలాగే నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఆ ప్రభావం తిరిగి మరుసటి ఉదయం మీపై పడుతుంది. పగటి నిద్రకు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. గంటల తరబడి కునుకు తీయడం సరికాదు. ఈ పగటి నిద్ర మరీ ఎక్కువ సమయం కాకుండా కేవలం 10 నుంచి 20 నిముషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే చురుకుతనం, చలాకీతనం పెరిగి ఎంతో ఉపయోగం వుంటుంది. చిన్న కునుకు పేరుతో మధ్యాహ్నం నిద్ర 20 నిమిషాలు దాటితే మాత్రం కొన్ని నష్టాలు కలుగుతాయని మరిచిపోకండి.
పగటి పూట 10-15 నిమిషాల పాటు నిద్రపోతే మంచిదే కానీ.. గంటలపాటు పగటిపూట నిద్రపోతే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని నిపుణులు చెప్తున్నారు. రోజూ పగటి పూట గంట కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 45శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొంచెం రిలాక్స్ అవడానికి చిన్న పవర్ నాప్ వేయండి కానీ ఎక్కువసేపు పడుకొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు.