ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం దిశగా వెనెజువెలాను నడిపించినందుకుగానూ ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. వెనెజువెలాలో శాంతియుతంగా మార్పు తీసుకొచ్చేందుకు మరియా విశేషంగా కృషి చేశారు. అయితే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఈసారి తీరలేదు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనాను ఎంపిక చేసినట్లు శుక్రవారం అకాడమీ ప్రకటించింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం స్పందించింది. శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ప్రాముఖ్యమిచ్చారంటూ విమర్శలు గుప్పించింది.










