ఏ పార్టీ వారైనా రాజ్యసభకు నిర్వహించే ఎన్నికల్లో ఒక రాజ్యసభ సీటు గెలవాలి అంటే 44 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 27న జరిగే మూడు రాజ్యసభ సీట్ల ఎన్నికకు 132 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే సరిపోతుంది. కానీ 151 సీట్లు గెలుచుకున్న వైసిపి ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు ఎందుకు భయపడుతుంది? 151 మందిలో 132 మంది కూడా ఓట్లు వేయరా? తెలుగుదేశం పుట్టినప్పటినుంచి ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది… ఈసారి అవకాశం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం కి ఇస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ఫిబ్రవరి 27 గండం ఎలా గట్టెక్కాలో వైసీపీకి అస్సలు అర్థం కావడం లేదు..! వైసీపీకి ఉన్న 151 సీట్లలో.. ఐదుగురు పార్టీ మారిపోయారు.. మిగిలిన 146 మందిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి,ఎలిజా, ఆదిమూలపు, పార్థసారథి ఇలా మరో 12 మంది ఎమ్మెల్యేలు అధిష్టానం పై తిరుగుబాటు చేయగా 134 మిగిలాయి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. అదే వైసిపి ముందున్న సవాల్… వీరంతా ఓటేసినా వైసిపి సేఫ్ జోన్ లో ఉన్నట్టే లెక్క. తెలుగుదేశం తరపున ఉన్న ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ తన సీటును కోల్పోనున్నాడు. తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా ఉండటం ఇదే మొదటిసారి. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి తెలుగుదేశం వైసిపి రెబల్ ఎమ్మెల్యేల పైన దృష్టి పెట్టింది.
గంటా శ్రీనివాసరావు మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్న రాజీనామాను.. ఉన్నఫలంగా స్పీకర్ ఆమోదించటం చూస్తుంటే మూడు రాజ్యసభ సీట్ల లొ ఒక్కటి కూడా వదులుకోవడానికి వైసిపి సిద్ధంగా లేదు అని అర్థమవుతుంది. 50 కి పైగా వైసిపి సీట్ల తారుమారు చేయడం.. ఎంపీలను మార్చటం ఇన్చార్జిలను మార్చడం వల్ల సుమారు పాతికమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పైకి చెప్పుకోలేకపోయినా కొంతమంది లోలోన రగిలిపోతూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యసభకు ఓపెన్ ఓటింగ్ విధానం అమలులో ఉంది కాబట్టి.. ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో అన్న వార్తలు బయటకు వస్తే.. వైసిపి రెబల్ ఎమ్మెల్యేల గుట్టు రట్టవుతుంది.. ఎవరెవరు తిరుగుబాటు జెండా ఎగరేశారు అన్నదానిపైనే వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.