Lemon Juice: నిమ్మరసంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!

By manavaradhi.com

Published on:

Follow Us

నిమ్మరసంలో ఎంతటి అద్భుత ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. విటమిన్ సి తోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి. దీన్ని మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. కొందరు సౌందర్య సాధనంగా కూడా నిమ్మరసాన్ని వాడుతారు. నిమ్మరసం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయం. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో రుచికిగాను విరివిగా వాడుతూంటారు. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం.

మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తాయి. మనలో చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుంది.

నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి. నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది.

  • రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా సేవించవచ్చు. దాంతో శరీర ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
  • వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఆ లక్షణాలను దూరం చేసే యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.
  • చర్మ కాంతిని పెంచే ఔషధ గుణాలు కూడా నిమ్మరసంలో ఉన్నాయి. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తద్వారా కలిగే ఇతర అనారోగ్య లక్షణాలు కూడా దూరమవుతాయి.
  • నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం పోతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయి.

చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది. గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. తల తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు, శరీరంలో లవణాలు బాగా తగ్గినప్పుడు నిమ్మరసం ఇస్తే త్వరగా కోలుకుంటారు.

  • జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసంతోపాటు, పళ్లరసాలు ఇస్తే ఆ తీవ్రత త్వరగా తగ్గుతుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మ బాగా పనిచేస్తుంది.
  • నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇది సోడియంతో కలిసి మెదడు, నాడీవ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
  • నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి, కీళ్లనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.

నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం ద్వారా శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

Leave a Comment