ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే కంటి చూపుకే ప్రమాదం. మరి డ్రై ఐస్ సమస్యను నివారించలేమా? అంటే ఖచ్చితంగా నివారించవచ్చు. డ్రై ఐస్ సమస్యకు గురికాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
కంటి పనితీరు బాగుండాలంటే దాని వెలుపలి, లోపలి భాగాల్లో తగినంత తేమ ఉండాలి. అయితే పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలి, విశ్రాంతి లేమి వంటి కారణాలు కంటిలో తేమను తగ్గేలా చేస్తున్నాయి. కంటిలో రక్షణ వలయంగా ఓ నీటి పొర ఉంటుంది. ఇది ఉన్నంత కాలం కంటికి ఏ ఇబ్బందులూ ఉండవు. సహజంగానే మన శరీరం దీన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ తేమ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల కళ్ళకు సంబంధించిన ఇబ్బందులతో పాటు, దృష్టి లోపాలు కూడా ఎదురౌతాయి. మన కను గుడ్డు మీద ఓ నీటి పొర ఉంటుంది. కళ్ళలోకి వచ్చే దుమ్ము, ధూళి, ఇన్పెక్షన్లతో పోరాడి, వాటిని బయటకు పంపే బాధ్యత ఈ నీటి పొరదే. సాధారణంగా కంటికి వచ్చే సమస్యల్లో డ్రై ఐ సిండ్రోమ్ ఒకటి. దీని వళ్ళ కళ్ళలో తయారయ్యే నీటి స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కళ్ళు పొడి బారడం వల్ల ఎలాంటి సమస్య వస్తాయి?
కళ్ళు పొడిబారడానికి ప్రధాన కారణాల్లో వయసును ముందుగా చెప్పుకోవాలి. కంట్లో నీటిని స్రవించే గ్రంథులు పని చేయడం ఆగిపోతుంది. కొన్ని సమయాల్లో అవి పగిలిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఫలితంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కళ్ళు పొడి బారేలా చేస్తాయి. లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ ఇబ్బంది కచ్చితంగా ఉంటుంది. కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో కూడా కళ్ళు పొడిబారే సమస్య ఎదురౌతుంది. అందుకే ఈ సమయంలో వైద్యులు కంటి కోసం చుక్కల మందును సూచిస్తారు. కొన్ని రకాల మందులు వాడే వారిలో కంటిలో స్రవించే నీటి స్థాయి తగ్గిపోతుంది. ఇటువంటి వారిలో కూడా కళ్ళు పొడిబారే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం తక్కువ ఉండే ప్రాంతాల్లో, ఏసీ గదుల్లో పని చేసే వారికి, బాగా ఎక్కువగా ఎదురు గాలి వస్తున్న పరిస్థితుల్లో ఉండేవారికి ఈ తరహా సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. అందుకే బైకుల మీద వెళ్ళే వారు విధిగా కంటి అద్దాలను ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మరిన్న ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా స్మార్ట్ పోన్ స్క్రీన్ చూస్తున్న వారిలో కూడా కంటిలో తడి ఆరిపోయి సమస్య ఎదురౌతుంది. కాంటాక్ట్ లెన్స్ వాడే వారికీ ఈ తరహా సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది.
కళ్ళు పొడి బారకుండా ఉండాలంటే ఎలాంట జాగ్రత్తలు తీసుకోవాలి?
వృత్తి రీత్యా కంప్యూటర్ తో వర్క్ చేయవలసి వస్తే ప్రతి రెండు గంటలకు కనీసం రెండు నిముషాలు కళ్ళు మూసి ఉంచాలి. కంప్యూటర్ స్క్రీన్ పై చూస్తూ ఉంటే రెప్పవాల్చడం కూడా తగ్గిపోతుంది. అలాగే మధ్యమధ్యలో అలా నడకకు వెళ్లి పచ్చటి చెట్లను చూడాలి. ఇలా చేయడం వలన కంటి అలసట తగ్గుతుంది. మధ్యమధ్యలో కంప్యూటర్ స్క్రీన్ కి విరామం ఇవ్వడం వలన కళ్లపై దుష్ప్రభావాలు అంతగా పడవు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిద్రను కూడా త్యాగం చేసి రాత్రి వేళల్లో కూడా పనిచేయడం వలన కళ్ళు మరింత అలసటకు గురవుతాయి. కాబట్టి, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. మన కళ్లకు రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరమవుతుంది. అప్పుడే, కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. ఆహారంలో కంటి సంరక్షణకు అవసరమయ్యే పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆకుకూరలను తరచూ తీసుకోవాలి. పాలను రోజూ తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారపదార్థాలను డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఐ డ్రాప్స్ ను తరచూ వాడకూడదు. కంట్లో ఏదైనా అసౌకర్యం తలెత్తితే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కంటి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కళ్ళల్లో ఇష్టమొచ్చినట్లు డ్రాప్స్ ను వాడితే దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదం ఉంది.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి, ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన పెద్ద సమస్యల బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అలాగే మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.