Sinusitis : సైనసైటిస్ సమస్యలు తలెత్తడానికి కారణాలు- పరిష్కార మార్గాలు ఏంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Sinusitis: Symptoms, causes, and treatment

ఒకప్పుడు సైనసైటిస్ అంటే కేవలం వానాకాలం, శీతాకాలల్లోనే బాధపెట్టేది. అయితే ఇప్పుడు కాలం మారింది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వేసవి కాలంలోనూ సైనసైటిస్ బాదిస్తోంది. సైనస్ నిర్థారణ మరియు ఆపరేషన్లలో ఎండోస్కోపిక్ కీలక పాత్ర పోషిస్తోంది. ముక్కు, ముఖంపై గాట్లు లేకుండా, ముక్కు లోపల నుంచే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఆసుపత్రిలో గడపాల్సిన సమయం, ఖర్చు కూడా తక్కువే.

వాతావరణ మార్పులు… కాలుష్యం… మారుతున్న జీవన విధానం…. ఈ మూడింటి వల్ల ఎలర్జీ, సైనస్ సమస్యలు ప్రతి ఒక్కరిలో సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా సైనసైటిస్ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మన పుర్రెలో ముక్కు పక్కన, నుదురు దగ్గర ఉండే 4 జతల గాలి గదులే..‘సైనస్‌’. పుర్రె మొత్తం ఎముకలతో నిండి ఉంటే మెడ ఆ బరువును మోయటం కష్టం కాబట్టి పుర్రెను తేలికపరచటం కోసం సహజసిద్ధంగానే ఈ గాలి గదులు ఏర్పడ్డాయి. అలాగే ఈ సైనస్‌లలో నిండుకున్న గాలి వల్లే మన స్వరం శ్రావ్యంగా ధ్వనిస్తుంది. ఈ గాలి గదుల వల్ల ఉన్న మరో ముఖ్యమైన ప్రయోజనం ఎయిర్‌ కండిషనింగ్‌. అంటే మనం పీల్చే అతి చల్లని లేదా అతి వేడి గాలిని శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రత దగ్గరకు ఈ గాలి గదులు మార్చేసి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తాయి. పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉంటాయి.

సాధారణంగా సైనసిస్‌లో మ్యూకస్ అనే పలుచని ద్రవం కొద్ది ప్రమాణంలో తయారవుతుంది. దీని వల్లే ముక్కు ఎప్పుడూ తడిగా ఉం టుంది. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు మనం తీసుకునే పోషకాహారాన్ని బట్టి మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని బట్టి జలుబు నుంచి శరీర రోగ నిరోధక స్థాయిలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ జలుబు మూడు వారాల కంటే ఎక్కువుగా ఉంటే మ్యూకోజాలో వాపు వస్తుంది. అప్పుడు సైనసిస్‌లో ఉండే ద్రవం బయటకు రాలేక నిలువ ఉంటుంది. ఈ నిలువ ఉన్న ద్రవాలకు బ్యాక్టరీయా, వైరస్ తోడవ్వడం వల్ల సైనసైటిస్ వస్తుంది.

కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా ఈ సైనస్ ని గుర్తించవచ్చు. తుమ్ములు, ముక్కుదిబ్బడ, తలనొప్పి, తలంతా బరువుగా ఉండడం, ముఖంలో వాపు, సైనస్‌ భాగంలో నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలుంటాయి. తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తలంతా బరువుగా ఉంటుంది. ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో ముక్కు వెనక భాగం నుంచి మ్యూకస్‌ గొంతులోకి వెళుతుంది. ముఖంలో వాపు కనిపిస్తుంది.

సైనసైటిస్‌ లక్షణాలతో రోగి వైద్యుల్ని సంప్రదించినప్పుడు సమస్య తీవ్రత, కాల వ్యవధి, జీవన శైలి ఆధారంగానే ఈ వ్యాధి గురించి అవగాహనకు వస్తారు.. అలాగే నొప్పి ప్రదేశం, తీవ్రతలనుబట్టి సైనస్‌ వ్యాప్తి, ఉధృతిని అంచనా వేస్తారు. కన్ను, చెవి నొప్పులను కూడా పరిగణలోకి తీసుకుని ఇన్‌ఫెక్షన్‌ ఎంత మేర వ్యాపించిందో లెక్క వేస్తారు. ముక్కు, గొంతు, చెవుల్ని పరీక్షించి అక్కడున్న వాపును వైద్యులు పరిశీలిస్తారు. సైనస్‌ల ద్వారాలు వాచి ఉన్నాయా…. ఎర్రగా కందిపోయి ఉన్నాయా…. ఎంత మేరకు మూసుకుపోయాయి… అనే విషయాలు కూడా ప్రత్యక్షంగా పరీక్షించటం ద్వారా వైద్యులు సైనస్ గురించి అవగాహనకు వస్తారు. ఎండోస్కోపీ పరీక్ష ద్వారా సైనస్‌ల పరిస్థితిని వైద్యులు తెలుసుకోగులుగుతారు. ఎటువైపు సైనస్‌లు ఎంత మేరకు మూసుకుపోయాయి…. వాటిలో ఎలాంటి డిస్చార్జ్‌ ఉంది… ముక్కు వెనక భాగంలో కఫం కారుతోందా… లాంటి విషయాలను ఈ పరీక్షతో తెలుసుకోవచ్చు.

ఎక్స్ రే, సిటిస్కాన్ పరీక్షలు పరోక్షంగా మనకు వ్యాధి నిర్థారణ చేసే సాధనాలు అయితే ముక్కు ఎండోస్కోపి విధానం ప్రత్యక్షంగా వ్యాధి గురించి తెలిపే అత్యంతాధునిక పరీక్ష. దీనిలో ఒక సన్నని టెలిస్కోపు ద్వారా తెల్లని కాంతిని విరజిమ్మి ముక్కులోకి పంపించి ముక్కులోని భాగాలన్నింటిని స్పష్టంగా చూడవచ్చు. ఎంతోకాలంగా ముక్కులో వున్న జబ్బు గురించి తెలియని నగ్న సత్యాలను ఈ ఎండోస్కోపి పరీక్ష ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ ఎండోస్కోపు లేని రోజుల్లో ముక్కు సమస్యలు ఉన్న రోగులు అవగాహన లేక నరాల డాక్టర్లను, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించేవారు. ఈ నాసిల్ ఎండోస్కోపి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ఎంతోమంది జబ్బులకు అసలు కారణం తెలుసుకోగలుగుతున్నాము. అలా తెలుసుకున్నాక చికిత్స చాలా సరళతరం అయి, సత్ఫలితాలను ఇవ్వగలుగుతున్నాయి.

ఎండోస్కోపీ ద్వారా స్రావాన్ని సేకరించి కల్చర్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ కారకాన్ని గుర్తించి తదనుగుణ చికిత్సను అందిస్తారు. దీన్నే సైనస్ కల్చర్ అంటారు. సైనసైటిస్‌ చికిత్స ప్రధానంగా నోటి మందులతోనే సాగుతుంది. లక్షణాలు తక్కువగా ఉండి, పసుపు పచ్చని కఫం లేకుండా కేవలం ముఖంలో నొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు, కొద్ది జ్వరం ఉంటే నొప్పి తగ్గటానికి యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ మందులను వైద్యులు సూచిస్తారు. అలాగే ముక్కులో వాపు తగ్గించటం కోసం నాసల్‌ డీకంజెస్టెంట్స్ ను కూడా వైద్యులు సూచిస్తారు. వీటిని వాడటం వల్ల మూసుకుపోయిన సైనస్‌ ద్వారాలు తెరుచుకుంటాయి. రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు ఆవిరి పట్టమని కూడా చెబుతారు. ఎక్కువ సమయంపాటు తక్కువసార్లు ఆవిరి పట్టేకంటే తక్కువ సమయంపాటు రోజులో ఎక్కువసార్లు ఆవిరి పట్టడం మేలు. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్‌లు తెరుచుకుని వాటిలో చేరుకున్న కఫం కరిగి ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. దాంతో వాపు, నొప్పి తగ్గుతాయి.

సైనసైటిస్‌ సమస్య సర్జరీకి దారితేసే పరిస్థితులు ఎంతో అరుదు. సాధారణంగా సమర్ధమైన యాంటిబయాటిక్స్‌తో సైనసైటిస్‌ను నివారించవచ్చు. అయినా అతి కొద్దిమందిలో ఈ సమస్య వదలకుండా పీడిస్తూనే ఉంటుంది. ఎక్యూట్‌ సైనసైటిస్‌ నుంచి క్రానిక్‌ సైనసైటిస్‌కి మారి నెలలు గడుస్తున్నా తగ్గనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయవలసి ఉంటుంది. లేదా ఎక్యూట్‌ సైనసైటిస్‌లో కంటికి ఇన్‌ఫెక్షన్‌ చేరుకుని ఆర్బిటల్‌ సెల్యులైటిస్‌ అనే సమస్య తలెత్తినప్పుడు కూడా సర్జరీ చేయవలసిరావొచ్చు. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు కూడా పాకుతుంది. ఆ పరిస్థితిని మెనింగ్జైటిస్‌ లేదా బ్రెయిన్‌ యాప్సిస్‌ అంటారు. అలాంటప్పుడు ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ చేసి సైనస్‌లలో చేరుకున్న చీమును తొలగిస్తారు.

మనదేశంలో ఈ ఎండో స్కోపిక్ సైనస్ సర్జరీ ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఈ చికిత్సానంతరం ముక్కు, ముఖంపై ఎటువంటి గాటు, గాయం ఉండదు. శస్తచ్రికిత్స చేయించుకున్నాం అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఈ ఆపరేషన్‌ని ముక్కులోపలనించి చేస్తారు కనుక. ఆసుపత్రిలో గడపాల్సిన సమయం, ఖర్చు కూడా తక్కువే.

ఈ సర్జరీ వల్ల ఒరిగే ఫలితం 40 శాతమే! మిగతా 60 శాతం ఫలితం సాధించాలంటే సర్జరీ తర్వాత వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలి. మందులతోపాటు నాసల్‌ డూషింగ్‌ చేయాలి. కనీసం 3 నెలలపాటు క్రమంతప్పక ముక్కును నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటే అక్కడ చేరుకునే ఇన్‌ఫెక్షన్‌, సర్జరీ తాలూకు స్రావాలు పూర్తిగా తొలగిపోయి సైనసైటిస్‌ తిరగబెట్టే ప్రమాదం తగ్గుతుంది.

Leave a Comment